Begin typing your search above and press return to search.

90 సెక‌న్ల‌లో బాలాకోట్ దాడి పూర్తి చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:36 AM GMT
90 సెక‌న్ల‌లో బాలాకోట్ దాడి పూర్తి చేశార‌ట‌!
X
పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో అందుకు ప్ర‌తిగా పాక్ కు గుణ‌పాఠాన్ని చెప్పేందుకు.. వారి భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాన్ని భార‌త వాయుసేన టార్గెట్ చేయ‌టం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారు జ‌రిపిన ఆప‌రేష‌న్ కు సంబంధించిన కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

బాలాకోట్ ఆప‌రేష‌న్లో పాల్గొన్న పైలెట్ ఒక‌రు త‌న భార్య‌కు కూడా చెప్ప‌ని విష‌యాల్ని మీడియాకు వెల్ల‌డించారు. ఇద్ద‌రు పైలెట్ లు తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన‌ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. బాలాకోట్ దాడిని కేవ‌లం ఒక‌టిన్న‌ర నిమిషం (90 సెక‌న్ల‌లో) పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. తానీ ఆప‌రేష‌న్ లో పాల్గొన్న విష‌యాన్ని త‌న భార్య‌కు కూడా చెప్ప‌లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

బాలాకోట్ దాడి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌న భార్య త‌న‌ను అడిగింద‌ని.. దాడిలో పాల్గొన్నావా? అంటే తాను స‌మాధానం చెప్ప‌కుండా నిద్ర‌పోయిన‌ట్లు చెప్ప‌టం విశేషం. పుల్వామా ఘ‌ట‌న త‌ర్వాత జైషే ఉగ్ర‌మూక అంతు చూడాల‌ని తాము డిసైడ్ అయ్యామ‌ని.. ఇందులో భాగంగా బాలాకోట్ ఉగ్ర‌శిబిరాన్ని తాము టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నామ‌న్నారు.

దాడికి స‌రిగ్గా రెండు రోజుల ముందు నుంచి స‌రిహ‌ద్దుల‌ను అత్యంత ద‌గ్గ‌ర‌గా కాంబాట్ ఎయిర్ పెట్రోలింగ్ ను పెంచామ‌ని.. ఇదంతా వ్యూహంలో భాగంగా చేసిన‌ట్లు చెప్పారు. మ‌నం ఎందుకిలా చేస్తున్నామో అర్థం కాక పాక్ గంద‌ర‌గోళానికి గురైన‌ట్లు చెప్పారు. బాంబుదాడి జ‌ర‌గ‌టానికి కొన్ని గంట‌ల ముందు మాత్ర‌మే స‌న్నాహాలు స్టార్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

పిబ్ర‌వ‌రి 25 సాయంత్రం నాలుగు గంట‌ల‌కు స్పైస్ 2000 బాంబుల‌ను బ‌య‌ట‌కు తీశామ‌ని..వాటిని మిరాజ్ 2000 యుద్ధ విమానాల‌కు అమ‌ర్చిన‌ట్లు చెప్పారు. ఉగ్ర‌క్యాంప్ న‌కు సంబంధించిన స‌మాచారాన్ని స్మార్ట్ బాంబ్ లో అమ‌ర్చామ‌ని.. అర్థ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యం దాటిన త‌ర్వాత విమానాలు గాల్లోకి లేచిన‌ట్లు చెప్పారు. దేశంలోని వేర్వేరుప్రాంతాల నుంచి బ‌య‌లుదేరిన యుద్ధ విమానాలు క‌శ్మీర్ కు చేర‌గానే రేడియో సైలెన్స్ ను పాటించాయ‌న్నారు. విమానాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌టానికి ప్ర‌త్య‌ర్థుల‌ను త‌ప్ప‌దోవ ప‌ట్టించ‌టానికి సుఖోయ్ 30 ఎంకేఐ విమానాల బ‌లగం కూడా స్టార్ట్ అయిన‌ట్లు చెప్పారు.

త‌మ‌లోని ఒక బృందం వేరే మార్గంలోకి వెళ్లింద‌ని.. తాము పాక్ భూభాగంలోకి అడుగుపెట్టిన 90 సెక‌న్ల‌లోనే త‌మ ప‌ని పూర్తి చేసుకొని వెన‌క్కి వ‌చ్చేశాన‌ని.. తాను దాడి చేసిన విష‌యాన్ని త‌న భార్య‌కు నేటికి చెప్ప‌లేద‌ని స‌ద‌రు పైలెట్ చెప్పారు. హాలీవుడ్ సినిమాను త‌ల‌పించేలా దాడి ప్లాన్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.