Begin typing your search above and press return to search.

అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా భారత సంతతి కమలా

By:  Tupaki Desk   |   13 Aug 2020 11:50 AM GMT
అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా  భారత సంతతి కమలా
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అయిన డొనాల్డ్ ట్రంప్‌కి డెమొక్రాట్ల తరపున ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న జో బిడెన్... క్రమంగా తన నెక్ట్స్ పదవుల అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. కాలిఫోర్నియా హై ప్రొఫైల్ సెనెటర్ అయిన కమలా హారిస్ పేరును ఉపాధ్యక్ష అభ్యర్థిగా మంగళవారం ప్రకటించారు. ఆ పదవికి ఎవరిని పోటీలో నిలబెట్టాలా అని జో నెల పాటూ వెతికి వెతికి కమలా హారిస్ ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చే రేంజ్‌లో కమలా హారిస్ స్పీచ్‌లు ఇవ్వగలరనీ, ప్రజలను ఆకట్టుకోగలరని జో లెక్కలేశారు. ఆమెకి అమెరికాలోని బెస్ట్ నేతల్లో ఒకరిగా పేరుంది. అలాగే , ఆమె ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యరు. ధైర్యం ప్రదర్శించడంలో ఆమెకు తిరుగులేని ట్రాక్ ఉంది.

ఆమె తల్లిదండ్రులు విదేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి జమైకాకి చెందిన వారు. తల్లి ఇండియన్. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ ఆమె. అలాగే , అమెరికా సెనేట్‌కి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్ కూడా ఆమే. నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పేరే అధ్యక్ష రేసులో ఉంది. 2019 డిసెంబర్‌లో ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత మార్చిలో జో బిడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఆమె గెలిస్తే , వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం కూడా ఉంది.

కమలా తల్లి శ్యామలా గోపాలన్ హారిస్‌ది భారతదేశమే. తమిళనాడుకు చెందిన ఆమె 2009లో క్యాన్సర్ బారిన పడి మరణించింది. కమలా భర్త పేరు డగ్‌, పిల్లలు కోల్‌, ఎలా ఉన్నారు. కాగా కమల తన సహచర లాయర్‌ డగ్లస్‌ ఎమాఫ్‌ ను పెళ్లి చేసుకున్నారు. డగ్లస్ ‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లే ఎలా, కోల్‌. కమలాకు మాయా అనే చెల్లెలు కూడా ఉన్నారు. కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త. కమలాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.కమలా, మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు.ఆ ముగ్గురినీ కలిపి... వారికి తెలిసినవాళ్లు ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని పిలిచేవాళ్లు. కమలా హారిస్ భారత సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు అని గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచారం చేసింది.

2015లో సెనేట్‌కు కమలా పోటీ చేసినప్పుడు... ఆమెను ‘భారతీయ క్యాన్సర్ పరిశోధకురాలు, జమైకన్ ప్రొఫెసర్‌ల కూతురు’గా ఎకనామిస్ట్ మ్యాగజైన్ వర్ణించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్. కమలా హ్యారిస్‌ను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది.మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆమె అభ్యర్థిత్వంతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు. కమల అభ్యర్థిత్వం భారతీయ అమెరికన్ వర్గానికి చాలా గొప్ప విషయమని డెమొక్రాటిక్ పార్టీ కార్యకర్త శేఖర్ నరసింహన్ అన్నారు. ఆమె మహిళ. రెండు జాతుల నేపథ్యం ఉంది. బిడెన్ ఎన్నికల్లో గెలవడానికి ఆమె చాలా ఉపయోగపడతారు. చాలా వర్గాలు ఆమెతో కనెక్ట్ అవుతాయి. ఆమె చాలా తెలివైనారు కూడా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.భారతీయ అమెరికన్లు ఆమె విషయంలో ఎందుకు గర్వపడకూడదు మాకు కూడా గుర్తింపు వస్తోందనడానికి ఇది సంకేతం అని నరసింహన్ అన్నారు.