Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులకు ఉరి పడకుండా అడ్డుకుంటోంది ఎవరు?

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:19 AM GMT
నిర్భయ దోషులకు ఉరి పడకుండా అడ్డుకుంటోంది ఎవరు?
X
దారుణమైన నేరాలకు పాల్పడిన తర్వాత శిక్ష అమలు కాకుండా చేయటంలో చట్టాలు ఇంతలా సాయం చేస్తాయా? అన్న సందేహం నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష ఏదో రూపంలో వాయిదా పడుతున్న వేళ కలుగుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా దాఖలు అవుతున్న పిటిషన్ల పరంపర చూస్తుంటే.. ఇలాంటివన్నీ నిర్భయ దోషులు వేసేంత సీన్ లేదు. దీని వెనుకున్న మాస్టర్ మైండ్లు వారికి న్యాయ సాయాన్ని అందించే లాయర్లే ప్రముఖంగా కనిపిస్తారు.

న్యాయశాస్త్రంపై తమకున్న పట్టు ఏ పాటిదన్న విషయాన్ని తెలియజేయటంతో పాటు.. తిమ్మిని బమ్మిని చేయటంలో తమకున్న పట్టును ప్రదర్శించటానికి ఇలాంటి సంచలన కేసులు చాలామేర సాయం చేస్తాయి. చట్ట ప్రకారం చేస్తున్నట్లు కనిపించినా.. నైతికత విషయంలో ఎవరికి వారు సొంత హద్దులు రాసుకుంటూ తమకు తోచినట్లు చేసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్య భారతంలో కాస్త ఎక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

దీనికి తోడు చట్టంలోని కొన్ని సెక్షన్లు అండ చూసుకని పిటిషన్లతో చెలరేగిపోతున్న వైనాన్ని చూసి విస్మయానికి గురి అవుతున్నారు. అత్యంత పాశవికమైన చర్యకు పాల్పడిన తర్వాత కూడా వారిని ప్రాణాలతో ఉంచాలని వాదించే సీనియర్ న్యాయవాదుల మానవతావాదాన్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే.

గట్టిగా నాలుగు మాటలు మాట్లాడితే.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పై మతోన్మాదులు విరుచుకు పడుతున్నారంటూ విపరీత అర్థాలు తీసే వామపక్ష భావజాలతో పాటు.. మానవ హక్కులకు తామే బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్లు గా నీతులు చెప్పే వారు.. తమ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఇంతే ఔదార్యం తో వ్యవహరిస్తే అర్థం చేసుకోవచ్చు. అంతేకానీ.. నిర్భయ తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వటం చూసినప్పుడు మాత్రం ఒళ్లు మండక మానదు.

ఇంతకీ నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాకుండా పిటిషన్లతో అడ్డుపుల్ల వేస్తుంది ఎందుకు? దాని వెనుకున్న కతేమిటన్న మాటను న్యాయవాద మిత్రులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. ఇలాంటి సంచలన కేసుల్లో లాయర్ల ప్రతిభను యావత్ దేశం ప్రత్యేకంగా చూడటమే కాదు.. వారు తెర మీదకు తీసుకొచ్చే లిటిగేషన్ల తో వారి ప్రతిభ కు గుర్తింపు లభించటం తో పాటు.. ఇతర కేసుల్లో వారి ఫీజు భారీగా పెరిగే వీలుంటుందని.. అందుకే.. విమర్శలు..

ఇతరత్రా విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా ఇలా చేస్తుంటారని చెబుతున్నారు. కొందరు డబ్బు కోసం చేస్తే.. మరికొందరికి పేరు మీద ఉండే ఆసక్తి కూడా ఇలా చేయిస్తుందన్న మాట వినిపిస్తోంది. లోకమంతా తప్పే.. ఇలా చేయాల్సిందేనని డిసైడ్ అయితే.. నో.. నెవ్వర్.. అలా జరగటానికి వీల్లేదు..ఎలానో నే చెబుతా.. అంటూ చట్టంలోని సెక్షన్ల అర్థాలు చెప్పి మరీ.. తమ వాదనతో కన్వీన్స్ చేయటం మీద కొందరికి ఉండే ‘‘మోజు’’ కూడా ఇలాంటి వాటికి కారణం గా చెప్పక తప్పదు. మొత్తంగా.. వ్యక్తిగత అంశాలే.. వ్యవస్థలు తీసుకున్న నిర్ణయాల్ని అమలు కాకుండా చేస్తున్నాయని చెప్పక తప్పదు. అలాంటి వారికి పరిమితులు విధించాల్సిన సమయం ఆసన్నమైందా? అన్నదిప్పుడు ప్రశ్న.