Begin typing your search above and press return to search.

అమెజాన్ అధినేత స్పేస్ షిప్ లోకి ఏలియ‌న్స్ చొర‌బ‌డి.. కిడ్నాప్ చేసి..

By:  Tupaki Desk   |   25 July 2021 2:47 PM GMT
అమెజాన్ అధినేత స్పేస్ షిప్ లోకి ఏలియ‌న్స్ చొర‌బ‌డి.. కిడ్నాప్ చేసి..
X
అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ ఇటీవ‌ల అంత‌రిక్షకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న సంస్థ బ్లూ ఆరిజ‌న్ రూపొందించిన ‘న్యూ షెఫ‌ర్డ్‌’ అనే స్పేస్ షిప్ ద్వారా ఈ టూర్ ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు. ఇందులో ఇద్ద‌రు పైల‌ట్ల‌తోపాటు బెజోస్‌, అత‌ని సోద‌రుడు మార్కె బెజోస్‌, మ‌రో ఇద్ద‌రు ప్ర‌యాణికులు కూడా ఉన్నారు. మొత్తం ఆరుగురిని మోసుకెళ్లి న్యూ షెఫ‌ర్డ్ స్పేస్ షిప్.. విజ‌య‌వంతంగా భూమిని చేరింది. అంద‌రూ హ్యాపీ.. హెడ్ లైన్స్ లో వార్త‌లు. అంతా బాగానేఉంది.

అయితే.. ఇప్పుడు ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదేమంటే.. ఈ స్పేస్ షిప్ అంత‌రిక్షంలోకి వెళ్లిన త‌ర్వాత‌.. పాత‌ సినిమాల్లోని బందిపోటు దొంగ‌లు దారి దాచికాచి అడ్డ‌గించిన‌ట్టుగా.. ఈ స్పేస్ షిప్ ను అడ్డుకున్నార‌ట‌. అందులోకి ఏలియ‌న్స్ ప్ర‌వేశించి.. జెఫ్ బెజోస్ ను ‘‘యు ఆర్ అండ‌ర్ అరెస్ట్‌’’ అని ఆయుధం చూపించాయ‌ట‌. ఎందుకిలా అని అడిగితే.. ‘‘నిన్ను మేం కిడ్నాప్ చేస్తున్నాం’’ అని చెప్పాయట.

ఆయ‌న‌తో ఏలియ‌న్స్ కు ఏం ప‌ని అని మీరు అడుగుతున్నారా? మాకు తెలియదు. ఆ స్పేస్ షిప్ లో మొత్తం ఆరుగురు ఉంటే.. బెజోస్ ను మాత్ర‌మే ఎందుకు ఎత్తుకెళ్లారు అని అడుగుతున్నారా? ఇది కూడా మాకు తెలియ‌దు. మ‌రి, కిడ్నాప్ చేస్తే.. బెజోస్ తిరిగి భూమ్మీద‌కు ఎలా వ‌చ్చాడు? అని అడిగితే మాత్రం దీనికి స‌మాధానం తెలుసు.

దీనికి కూడా పాత సినిమానే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఒరిజిన‌ల్ హీరో ప్లేసులో.. డూపును పెట్టి మేనేజ్ చేస్తారు క‌దా.. అలాగ డూప్ బెజోస్ ను ఆ స్పేస్ షిప్ లో ఉంచి, ఒరిజిన‌ల్ బెజోస్ ను ప‌ట్టుకొని పోయార‌ట‌. ఇదంతా జ‌రిగింది ఎంత స‌మ‌యంలో తెలుసా? కేవలం 11 నిమిషాల్లో! అవును మ‌రి.. న్యూ షెఫ‌ర్డ్‌ స్పేస్ షిప్ అంత‌రిక్షంలోకి వెళ్లి, భూమ్మీద‌కు తిరిగి వ‌చ్చిన స‌మ‌యం కేవ‌లం 11 నిమిషాలే.

న‌మ్మ‌డానికి ఏ మాత్రం అవ‌కాశం లేని, అస‌లు వాస్త‌వ‌మే లేని ఈ వార్త‌ల‌ను అమెరికాలోని ఒక బ్యాచ్ సృష్టించింది. వాళ్లు ఎవ‌ర‌నేది క్లారిటీ తెలియ‌లేదుగానీ.. దీనికి వాళ్లు చూపిస్తున్న‌ సాక్ష్యం ఏంటో తెలుసా? ఆకాశంలోకి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత బెజోస్ మెడ పొడ‌వుగా సాగి ఉంద‌ట‌. ఆ మెడ ఏలియ‌న్స్ త‌యారు చేసిన డూప్ బాడీదే అంటోందీ బ్యాచ్‌. ఈ ప్ర‌చారం అమెజాన్ సంస్థ వ‌ర‌కూ వెళ్ల‌డంతో.. అది ఖండించింది. ఇలాంటి సొల్లు ముచ్చ‌ట్లు ఎవ్వ‌రూ న‌మ్మొద్ద‌ని ప్ర‌క‌టించింది.