ఆకాశంలో ఏలియన్ చక్కర్లు .. బిత్తర పోయిన జనం

Sun Oct 18 2020 16:00:05 GMT+0530 (IST)

Alien circles in the sky

ఎప్పుడు సినిమాల్లో చూడబట్టో.. లేక ఎవరైనా ఆసక్తిగా చెబుతుంటే వినడం వల్లో గ్రహాంతర వాసుల గురించి తరచూ ఏవేవో వింటుంటాం. ఫలానా గ్రహంలో జీవ జాతి ఉందని.. ఏలియన్ లు తరచూ భూమిపైకి వచ్చి వెళుతుంటారని  కథలుకథలుగా చెబుతుంటారు. కొందరైతే మరి హెలికాప్టర్ వంటి మెషిన్లో ఏలియన్లు వచ్చి వెళ్లడం చూశామంటూ ఎన్నోసార్లు పుకార్లు వ్యాపింపజేశారు.ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో శనివారం జరిగిన ఓ సంఘటన సంచలనం సృష్టించింది.  ఆకాశంలో ఓ వింత వస్తువుఎగురుతుండటం  చూసిన  జనం భయపడిపోయారు. అది  ఏలియన్ అని భ్రమించి భయపడ్డారు.

ఈ ఉదయం డాంకౌర్ ప్రాంతంలో ఆకాశంలో జనానికి వింత ఆకారంలో వస్తువు  కనిపించింది. అది  భట్టా పార్సాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కాలువలో దిగిందని అది గ్రహాంతర వాసి అయి ఉంటుందని చుట్టుపక్కలవారు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుని తిలకించారు. ఈనెల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వస్తువు ఎగురుతున్న ప్రాంతం వద్దకు వెళ్లి చూడగా అది బెలూన్ గా గుర్తించారు. అది మనిషి ఆకారంలో ఉండడంతో దాన్ని  జనం గ్రహాంతరవాసి గా భావించారు.

గాలితో నింపిన బెలూన్ కాసేపు గాల్లో ఎగిరి కాలువ ఉన్న ప్రాంతంలో కిందకు దిగి పొదల్లో చిక్కుకుంది. బెలూన్ లోని ఓ భాగం కాలువలో ప్రవాహాన్ని తాకడంతో అది కొద్దిగా పేలిందని డంకూర్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ కుమార్ పాండే తెలిపారు. ఆ బెలూన్ లోపల ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేవని.. దాన్ని ఎవరు ఎగరవేశారో  తెలుసుకునే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఓ బెలూన్ ను చూసి  జనం ఏలియన్ గా భావించడంతో  ఇది ఆ ప్రాంతమంతా సంచలనంగా మారింది.