Begin typing your search above and press return to search.

విశాఖ బాలికకు అరుదైన పురస్కారం!

By:  Tupaki Desk   |   23 Jan 2023 6:02 PM GMT
విశాఖ బాలికకు అరుదైన పురస్కారం!
X
విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల చెస్‌ దిగ్గజం.. అలనా మీనాక్షి కోలగట్ల అరుదైన పురస్కారానికి ఎంపికైయింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 కింద బాల పురస్కార్‌ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర మహిళా, శిశు మంత్రిత్వ శాఖ.. క్రీడా విభాగంలో అసాధారణ ప్రతిభా పాటవాలు చూపుతున్నందుకు 11 ఏళ్ల మీనాక్షిని రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపిక చేసింది.

ఈ అవార్డు కింద చిన్నారి మీనాక్షికి లక్ష రూపాయల నగదు, పతకం, ప్రశంసా పత్రం, ఇతర బహుమతులను అందజేస్తారు. వైజాగ్‌ నగరంలోని టింపనీ స్కూల్‌లో మీనాక్షి ఆరో తరగతి చదువుతోంది.

వైజాగ్‌ జిల్లాకు చెందిన ఈ బాలిక ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ ప్లేయర్‌గా ఘనత సాధించింది. అంతేకాకుండా 11 ఏళ్ల చిన్న వయసులోనే ఫిడే మహిళా, ఫిడే మాస్టర్‌ హోదాను సాధించి రికార్డు సృష్టించింది.

ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం.. అండర్‌-12 బాలికల విభాగంలో అలనా ప్రపంచ నం. 1 చెస్‌ క్రీడాకారిణిగా ఉంది. అంతేకాకుండా ఆమె కేటగిరీలో ఒక సంవత్సరానికి పైగా ప్రపంచ ఫిడే ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

2018లో, మీనాక్షి ఏడు సంవత్సరాల వయస్సులో చెస్‌ ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆసియా స్కూల్‌-7 ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. అలాగే ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన భారత జాతీయ బాలికల చాంపియన్‌షిప్‌-10లో కూడా మీనాక్షి స్వర్ణం సాధించింది.

కాగా జనవరి 23న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి బాల పురస్కార్‌ అవార్డును అందజేస్తారు. జనవరి 26న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మీనాక్షి పాల్గొంటుంది. జనవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ బాలల పురస్కార గ్రహీతలందరితో మాట్లాడతారు. ఇందులో భాగంగా ప్రధానితో మాట్లాడే అవకాశం మీనాక్షికి లభించింది.         



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.