అఖిలేష్ ఇంట్లో కమలం కుంపటి... ?

Sun Jan 16 2022 14:00:01 GMT+0530 (IST)

Akhilesh Political Strategy

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరైనా అక్కడ పావులే. అందుకే వారూ వీరూ తేడా లేకుండా అయారాం గయారాం కల్చర్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీ వంతు ఇక మీదట మా వంతు అంటోంది బీజేపీ.  బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలోకి చేర్చుకుని అసలు సర్వే ఇదే రేపు వచ్చేది మేమే అంటూ జబ్బలు చరుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్.మరి ఢక్కామెక్కీలు తిన్న బీజేపీ ఊరుకుంటుందా. అసలు తగ్గేది లేదు అంటోంది. మీకు కూడా చూపించాల్సింది చూపిస్తామని కమల కుతూహలాన్ని మొదలెట్టేసింది. ఏకంగా అఖిలేష్ ఇంట్లోనే కమలం కుంపటిని పెట్టేసింది. అఖిలేష్ యాదవ్ మరదలునే బీజేపీలోకి లాగేసేందుకు భారీ ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది.

అఖిలేష్ తముడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ని కమలం గూటికి చేర్చేందుకు పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. అపర్ణా యాదవ్ రాజకీయాల్లో చురుకైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి అపర్ణా యాదవ్ పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి రీటా బహుగుణ చేతిలో దాదాపు 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇపుడు ఆమెకు ఎస్పీ టికెట్ దక్కే సీన్ లేనట్లుగా ఉంది. దాంతో పాటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయని అంటున్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఆమెను తీసుకొచ్చి బావగారి పార్టీకే ఎదురు నిలపాలని చూస్తోంది. ఈ మేరకు అపర్ణతో చర్చలు జరిగాయని అంటున్నారు.  అయితే తనకు లక్నో కంటోన్మెంట్ సీటునే అపర్ణ యాదవ్ కోరుతోంది. కానీ బీజేపీ మాత్రం వేరే సీటు ఇస్తామని చెబుతోంది. దీంతో చర్చలు సాగుతున్నాయి.

సీటు విషయంలో పీటముడి విడిపోతే మాత్రం కచ్చితంగా అపర్ణ యాదవ్ బీజేపీ నుంచి పోటీ చేయడం ఖాయమే అంటున్నారు. అంటే బావగారూ బాగున్నారా అంటూ మరదలు సవాల్ చేయబోతోంది అన్న మాట. మరి కమలం మాస్టర్ ప్లాన్ తో అఖిలేష్ ఇంట్లోనే రాజకీయ వేడి రాజుకునేలా ఉంది. దీన్ని ఎస్పీ అధినేత ఎలా అధిగమిస్తారో చూడాలి.