Begin typing your search above and press return to search.

ఎజాజ్ పదికి పది వికెట్ల మాయాజాలం

By:  Tupaki Desk   |   4 Dec 2021 9:20 AM GMT
ఎజాజ్ పదికి పది వికెట్ల మాయాజాలం
X
న్యూజిలాండ్ ఎడమ చేతివాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. పదికి పది వికెట్లు.. టెస్టు మ్యాచ్ లో ఎప్పుడో కాని సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తో ముంబైలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు శనివారం ఎజాజ్ రికార్డు నెలకొల్పాడు.

తొలి రోజు శుక్రవారం ఆటలో నాలుగు వికెట్లు తీసిన అతడు శనివారం మిగతా 6 వికెట్లూ తన ఖాతాలోకి వేసుకున్నాడు. దీంతో భారత మొదటి ఇన్నింగ్స్ల్ లో మొత్తం పది వికెట్లూ అతడికే దక్కినట్లయింది.

కలయా ? నిజమా?

అప్పడెప్పుడో 1956 లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ పదికి పది వికెట్లు సాధిస్తే.. ఔనా అది నిజమా? అని అనుకున్నాం. నిజమేనని తెలిసి ఆశ్చర్యపోయాం.

ఆ తర్వాత 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై పదికి పది వికెట్లు సాధిస్తే అంతా అబ్బురపడిపోయాం. మధ్యలో ఒకరిద్దరు స్పిన్నర్లు 9 వికెట్లు తీసి పదో వికెట్ పడగొట్టలేకపోతే అయ్యో అనుకున్నాం. ‘‘ఫర్ ఫెక్ట్ 10’’ మళ్లీ చూడలేమా? అని అనుకున్నాం. ఈ తరం పిల్లలకైతే నాటి ఈ రెండు ఘనతలు కాస్తంత ఆశ్చర్యమే.

అసలు సాధ్యమా? అనుకుంటే?

టెస్టుల్లో పదికి పది వికెట్లు సాధించాలంటే ప్రతిభకు తోడు పిచ్, కొంత అవకాశమూ కలిసిరావాలి. అలాంటిదే ఎజాజ్ పటేల్ విషయంలో జరిగింది. మరో స్పిన్నర్ సోమర్ విల్లే ఉన్నప్పటికీ అతడు అంతగా ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోవడం ఎజాజ్ కు ఉపయోగపడింది.

పిచ్ పైన టర్న్ సద్వినియోగం చేసుకుంటూ చెలరేగిపోయాడు. అశ్విన్ వికెట్ ను అతడు పడగొట్టిన తీరే ఇందుకు నిదర్శనం. సెంచరీ వీరుడు మయాంక్ అగర్వాల్ వికెట్ నూ అంతే చక్కటి బంతితో సాధించాడు ఎజాజ్. అలా ఒక్కో వికెట్ తన వశం అవుతూ చిరవకు 10/10 అయింది.

వీరు 9 దగ్గరే ఆగిపోయారు

పైన చెప్పుకొన్నట్టు..పదికి పది రావాలంటే కొంత లక్ కూడా ఉండాలని ... 9 వికెట్ల దగ్గర ఆగిపోయిన వారిని అడిగితే ఇది నిజమేనని ఒప్పుకొంటారు. ముత్తయ్య మురళీధరన్ అయితే రెండు సార్లు (1998, 2002) 9 వికెట్లతో సరిపెట్టుకున్నాడు. మన కపిల్ దేవ్, సుభాష్ గుప్తే కూడా అంతే. 2014లో లంక స్పిన్నర్ రంగన్ హెరాత్, 2018లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ మహరాజ్ కూడా 9 వికెట్లతో ఆగిపోయారు.

ఇలా మొత్తం 17 సార్లు జరిగింది. అన్నట్లు..పదికి పది వికెట్లు తీసిన టెస్టులోనే జిమ్ లేకర్ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల దగ్గర నిలిచిపోయాడు. అంటే ఈ జాబితాలో అతడికీ చోటుదక్కిందన్నమాట.