Begin typing your search above and press return to search.

ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం.. ఉద్యోగులకు ఎన్నేళ్లు సెలవులంటే?

By:  Tupaki Desk   |   16 July 2020 4:30 AM GMT
ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం.. ఉద్యోగులకు ఎన్నేళ్లు సెలవులంటే?
X
ఇప్పటికే నష్టాల ఊబిలో చిక్కుకొని కిందామీదా పడుతున్న ఎయిరిండియాకు కరోనా ప్రభావం మరింత దారుణంగా తగలనుంది. నష్టాల నుంచి ఎలా బయటపడాలా? అన్న విషయంపై విపరీతమైన మధనం జరుపుతున్న వేళ.. అనుకోని రీతిలో వచ్చిన పడిన కరోనా దెబ్బకు.. ఆ సంస్థ తీవ్రమైన సంక్షోభంలోకి చిక్కుకుంది. కనీసం ఆరేడు నెలల వరకూ సామాన్య పరిస్థితులు నెలకొనని వేళలో.. ఇప్పుడు సంస్థకు సంబంధించి కొన్ని షాకింగ్ నిర్ణయాల్ని తీసుకున్నారు.

తమ వద్ద పని చేసే ఉద్యోగులకు సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అది కూడా ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు కావటం గమనార్హం. తన వద్ద పని చేస్తున్న సీనియర్ ఉద్యోగుల్లో కొందరిని ఏళ్లకు ఏళ్లు సెలవుల్లో పంపేయటానికి సిద్ధమైంది. అయితే.. ఈ సెలవు కాలానికి ఎలాంటి జీతాన్ని చెల్లించరు. ఉద్యోగుల సామర్థ్యం.. వారి పని తీరు ఆధారంగా సెలవుల నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగుల్నిసెలవుల మీద పంపటం ద్వారా.. ఆర్థిక భారం నుంచి తప్పించుకోవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యోగుల సీనియార్టీ.. వారి పనితీరు.. వయసు.. ఆరోగ్యం.. సామర్థ్యం లాంటి అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని ఎవరెవరిని సెలవులపై పంపాలన్నది డిసైడ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నారు.

జీతం చెల్లించని ఈ సెలవుల్లో కనిష్ఠంగా ఆర్నెల్లు.. గరిష్ఠంగా ఐదేళ్ల వరకు ఉన్నాయి. ఇప్పుడీ నిర్ణయం విమానయాన రంగంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 14న విడుదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ సిబ్బంది ఇదే తీరులో జీతాలు ఇవ్వని సెలవులపై పంపుతున్నారు. ఇప్పుడు ఎయిరిండియా కూడా ఆ బాటలోనే పయనించటం గమనార్హం.