Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ పై సొంత పార్టీ ఎంపీ ఆగ్రహం..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   27 Jan 2020 11:35 AM GMT
మోడీ సర్కార్ పై సొంత పార్టీ ఎంపీ ఆగ్రహం..ఎందుకంటే ?
X
అప్పుల భారంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయానికి పెడతామంటూ మోదీ ప్రభుత్వం సోమవారం సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం పై విపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పై విపక్షాల నుండే కాదు స్వపక్షం నుంచి కూడా మోడీ సర్కార్ విమర్శలను ఎదుర్కొంటుంది. మోడీ సర్కార్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం పై స్వయంగా సొంత పార్టీ ఎంపీ అయిన సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారం పై మోదీ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని ట్వీట్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే చర్య జాతి వ్యతిరేకమని - ఎయిర్ ఇండియా వాటాలు విక్రయించి కీలకమైన విమానయాన సంస్థలపై కూడా ప్రైవేట్ రంగాలను ఆహ్వానించినట్లవుతోందని సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం సరైంది కాదు అని - దీనిపై సమీక్షించాలని కోరారు. ఎయిరిండియా ఇప్పుడిప్పుడే నష్టాల నుండి బయటపడుతుంది అని, ఈ సమయాల్లో ఈ సంస్థను ఆదుకోకుండా ఎందుకు విక్రయిస్తున్నారని కూడా ఆయన సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

అటు, విపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ తీరును తప్పుపట్టింది. మోడీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ఆస్తులను నమ్మి సొమ్ముచేసుకొంటుందని విమర్శించింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని - వృద్ధి రేటు కూడా 5 శాతం కన్నా తక్కువ నమోదవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని గుర్తుచేశారు. ఇలా ముందుకెళ్తే దేశంలో ఉన్న విలువైన వనరులు కనుమరగవుతాయని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా తీవ్రంగా విమర్శించారు.

ఇకపోతే, ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని కేంద్రం ప్రకటించింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో, బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.