నిజమే.. నెహ్రూ చేయలేనిది.. మోడీ సర్కారు ‘అమ్మేస్తోంది’

Thu Sep 16 2021 15:01:53 GMT+0530 (IST)

Air India company is now being privatized

మొనగాడితనం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. తాము అభిమానించే వారిని మునగ చెట్టు ఎక్కించేయటం కోసం.. మొనగాడు ట్యాగ్ ను తగిలించటం ఒక అలవాటుగా మారింది. విషాదకరమైన విషయం ఏమంటే.. ఈ తోకలు తగిలించే వేళలో.. అభిమానులు తమ అభిమానం పేరుతో దురభిమానాన్ని ప్రదర్శించటం.. ఆ క్రమం వాస్తవల్ని చూడలేని దుస్థితికి జారుతున్నారు. ఎక్కడైనా తాత ఇచ్చిన ఆస్తుల్ని మనమళ్లు అమ్మేస్తే.. దాన్ని ఏమంటారు? దాన్ని ఎలా చూడాలి? సాధారణంగా మొనగాడు అంటే ఆస్తుల్ని సమకూర్చినవాడే తప్పించి.. ఉన్న ఆస్తుల్ని అమ్మేసేవాడు కాదు. ఇవాల్టి రోజున ఆస్తులు అమ్ముతున్నారంటే.. అవి ఉన్నందుకేగా? ఒకవేళ అవే లేకుంటే పరిస్థితి ఏమిటి?అవునన్నా కాదన్నా నెహ్రూ ఈ దేశానికి మంచే చేశారని చెప్పాలి. అలా అని ఆయనలో లోపాలు లేవని.. ఆయన నిర్ణయాలు అన్ని సరైనవన్న సర్టిఫికేట్ మేం ఇవ్వటం లేదు. ఎవరైనా కావొచ్చు.. వారున్న పరిస్థితులు..కాలం.. అప్పటికున్న అవగాహనకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని తప్పు పట్టటం వరకు ఓకే కానీ.. ఆ పేరుతో అన్నింటిని తప్పు పట్టేసే తీరు అయితే మంచిది కాదు.

మోడీ వర్గీయులు తరచూ నెహ్రూ ను అదే పనిగా విమర్శిస్తుంటారు. ఆయన పాలనలోని తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటారు. నెహ్రూ ఏం చేశారు? ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి మొదట్లో వెంటనే సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉండేది. కాలం గడిచేకొద్దీ.. మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తున్న తర్వాత నుంచి నెహ్రూ చేసిందేమిటి? మోడీ చేస్తున్నదేమిటన్న దానిపై స్పష్టత వచ్చేస్తోంది.

నెహ్రూ హయంలో ఆస్తుల కల్పన జరిగితే.. మోడీ హయాంలో ఆస్తుల్ని ఏడాపెడా అమ్మేయటం మొదలైంది. తాజాగా ఎయిరిండియా అమ్మకం ఎపిసోడ్ ను చూస్తే.. నెహ్రూ హయాంలో జాతీయం చేసిన ఈ సంస్థ ఇప్పుడు ప్రైవేటు పరం కావటం దిశగా అడుగులు వేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. తిరిగి టాటాల చేతికి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో?

1933లో జేఆర్డీ టాటా ఎయిరిండియాను స్థాపించారు. సక్సెస్ ఫుల్ గా నడిపించారు. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఎయిరిండియాను జాతీయం చేసింది. దీనిపై జేఆర్డీ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతారు. అయితే.. ఎయిరిండియాను జాతీయం చేసినప్పటికీ.. దాన్ని నడిపించే విషయంలో జేఆర్డీకి నాటి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఇదే జరిగింది.

ఎప్పుడైతే వారి ప్రభుత్వం కొలువు తీరిందో.. ఎయిరిండియా సంగతి చూడాల్సిన అవసరం లేదని జేఆర్డీకి చెప్పేసి.. ఆయన్ను తప్పించారని చెబుతారు. ఇప్పుడేమో మోడీ సర్కారు.. ఎయిరిండియాను అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చి.. ఏదో ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. టాటాలతో పాటు.. స్పైస్ జెట్ కూడా ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని చెబుతున్నారు. మోడీభజనపరులు.. ఆయన్ను అభిమానించే వారంతా నెహ్రూ ఏం చేశాడన్న మాట నోటి నుంచి వచ్చినంతనే.. ఆస్తులు ఇచ్చాడన్న మాట కౌంటర్ గా వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు.