‘మూసీ’ ఉగ్రరూపం.. హైదరాబాదీల్లో వణుకు!

Sun Oct 18 2020 14:40:25 GMT+0530 (IST)

Again musi Water Fury

హైదరాబాద్ ను ముంచెత్తిన వానలు మిగిల్చిన విషాదాన్ని మరువకముందే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ బస్తీలను అతలాకుతలం చేసింది.  ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ నది ముంచేసింది.ఈ ఘటనలో 50కి పైగా పేదలు ఉండే ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్ ఘాట్ మలక్ పేట దిల్ సుఖ్ నగర్ ప్రధాన రోడ్డు బంద్ అయ్యింది. పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.

హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అదికారులు 5 అడుగుల మేర 12 గేట్లను ఎత్తివేశారు. ఇక గండిపేటకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దాన్ని తెరువనున్నారు.

నిన్న రాత్రి కురిసిన వర్షాలతో పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచెత్తింది. మళ్లీ కాలనీలు నీట మునగడంతో  ప్రజలంతా భిక్కుభిక్కుమంటున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చింది.

భారీ వర్షాలతో ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని సీపీ అంజనీకుమార్ సూచించారు. పాతబస్తీల్లో చాలా ప్రదేశాల్లో వరద నీరు చేరిందని పోలీసులు రెస్క్యూ టీం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని అన్నారు.