Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్ తరువాత సంచలనాలేనా..?

By:  Tupaki Desk   |   3 Dec 2022 11:30 AM GMT
బాబు ఢిల్లీ టూర్ తరువాత సంచలనాలేనా..?
X
చంద్రబాబు మరోసారి ఢిల్లీ టూర్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నాలుగు నెలల తరువాత అని చెప్పాలి. గత టూర్ లో ఆయన ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం ముగింపు వేళ ఏం చేయాలి అన్న దాని మీద ప్రధాని మోడీతో జరిగిన అఖిల పక్ష భేటీలో పాలుపంచుకున్నారు. ఆ తరువాత మోడీతో ఆయన అదే మీటింగ్ హాల్ లో కరచాలనం చేసి మాటా మంతీ కూడా జరిపారు.

ఇక ఇపుడు మరోసారి అదే మోడీ మీటింగ్ లో బాబు కనిపించబోతున్నారు. ఈసారి మీటింగ్ జీ 20 సదస్సు మీద అయినా బాబు ఢిల్లీ వెళ్తోంది తనదైన రాజకీయ అజెండాతోనే అని అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలతో కలసి ముందుకు సాగాలని బాబు చూస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే కేంద్రం సహాయ సహకారాలు కీలక సమయంలో తనకు అన్ని విధాలుగా దక్కుతాయన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఇక మోడీ కానీ బీజేపీ కానీ బాబుని మరచిపోలేదు, వదులుకోలేదు అని చెప్పడానికే ఈ మీటింగులకు వరసబెట్టి మరీ ఆహ్వానం అని అంటున్నారు. దాంతో చంద్రబాబు కూడా ఈ సానుకూలతను ఒక సావకాశంగా మార్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత జనాలలో ఉందని టీడీపీ అంచనా వేస్తోంది.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అది మరింతగా ముదురుతుందని చివరికి వైసీపీ ఓటమికి అది దారితీస్తుందని టీడీపీ అంచనా కడుతోంది. కేంద్రంలోని బీజేపీకి కూడా ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ విషయాలు తెలుసు అని నమ్ముతోంది. ఈ రోజుకు బీజేపీ బెట్టు చేసినా సరైన సమయంలో కచ్చితంగా టీడీపీతో చేతులు కలుపుతుందన్న ధీమా అయితే టీడీపీ పెద్దలలో ఉంది.

అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఎక్కడా తన ఆశలను వదులుకోవడంలేదు. అదే టైం లో బీజేపీ మీద పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఇక మోడీతో మంచిగా ఉంటూనే పరిస్థితులను మొత్తం తమ వైపుగా తిప్పుకోవాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. గతసారి ఢిల్లీ వెళ్ళినపుడు మోడీ చంద్రబాబుతో తీరికగా చేసుకుని కలుద్దామని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈసారి దాన్ని గుర్తు చేయడం ద్వారా వీలైతే మోడీ అపాయింట్మెంట్ తీసుకుని మరీ భేటీ కావాలని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు.

మోడీ జీ 20 సదస్సుని ఏర్పాటు చేస్తున్నా బాబు అజెండా మొత్తం మోడీతో భేటీ మీదనే ఉంది అని అంటున్నారు. మోడీతో ఒక్కసారి బాబు సమావేశం అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో అది పెను సంచలనం అవుతుంది అని అంటున్నారు. మోడీ బాబును కలుసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారూ అంటే టీడీపీతో చెలిమి చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతమని కూడా అంటున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీతో భేటీ కోసం బాబు మార్క్ ప్రయత్నాలు తెర వెనక జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు.

బాబు ఢిల్లీ టూర్ తరువాత టోటల్ గా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలే చోటు చేసుకుంటాయని అవి వైసీపీ గుండెలలో గుబులు పుట్టించేలా సాగుతాయని అంటున్నారు. మొత్తానికి ఈ నెల 5న ఢిల్లీలో జరిగే సదస్సు ద్వారా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాలని సైకిల్ గేరు మార్చి జోరు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి అదే మీటింగ్ కి జగన్ హాజరవుతారా హాజరైతే ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తిని గొలుపుతున్న అంశంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.