Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆనందానికి హద్దే లేకుండా పోయే ప్రశంస.. 20 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని కేటీఆర్

By:  Tupaki Desk   |   24 May 2022 5:30 PM GMT
కేసీఆర్ ఆనందానికి హద్దే లేకుండా పోయే ప్రశంస.. 20 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని కేటీఆర్
X
''పుత్రోత్సాహము తండ్రికిపుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులాపుత్రుని గనుగొని పొగడగపుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ'' - తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి భావోద్వేగానికి గురై ఉంటారు.

తన కొడుకు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా దావోస్ లో జరుగుతున్న సదస్సుకు వెళ్లటం.. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస చర్చలు జరుపుతున్న ఆయన.. రాష్ట్రానికి పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నట్లుగా ఏ రోజుకు ఆ రోజు ప్రకటనలు ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం సదస్సులో తీసుకొచ్చే పెట్టుబడులకు మించి.. కేటీఆర్ సమర్థతకు ఒక సర్టిఫికేట్ లాంటి ఒక భారీ ప్రశంసను సొంతం చేసుకున్నారు. అది కూడా సోషల్ మీడియాలో కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దావోస్ లో కేటీఆర్ టీం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు వస్తున్న వేళ.. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయురాలు.. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు కమ్ ఎంట్రప్రెన్యూర్ అయిన అశా జడేజా మోత్వానీ మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కేటీఆర్ అద్భుతంగా కృషి చేస్తున్నట్లుగా ప్రకటిచటమే కాదు.. అంతకు మించిన అన్న రీతిలో ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

కేటీఆర్ పని తీరు సూపర్ అంటూ కొనియాడిన ఆమె.. దావోస్ లో తెలంగాణ టీం ఫుల్ ఫైర్ లో ఉందని.. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ గురించి తనతో చర్చించారని గుర్తు చేశారు. ఫ్యూచర్ లో తెలంగాణ డీల్స్ బిలియన్ డాలర్లు దాటి వెళ్లే అవకాశం ఉందన్నారు. ''కేటీఆర్ అంతటి విజన్ ఉన్న యువ పొలిటికల్ లీడన్ ను నేనెప్పుడూ చూడలేదు.

ఆయనకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన, స్పష్టత ఉంది. 20 ఏళ్ల తర్వాత భారతదేశానికి కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదు'' అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన మంత్రి కేటీఆర్ కు భారీ పెట్టుబడులకు మించిన తిరుగులేని ప్రశంసను మూటకట్టుకొని వచ్చారని చెప్పక తప్పదు. దీనికి మించిన సంతోష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏం ఉంటుంది చెప్పండి?