Begin typing your search above and press return to search.

ఈ వారంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బును కోల్పోయిన అదానీ .. ఎన్ని కోట్లంటే ?

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:31 AM GMT
ఈ వారంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బును కోల్పోయిన అదానీ .. ఎన్ని కోట్లంటే ?
X
భారతదేశం రెండో కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఈ మధ్యనే ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా నిలిచారు. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. గత ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ ఎస్ డీఎల్ ఇష్యూ తర్వాత ఈ వారంలో అంతేస్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీనితో కేవలం నాలుగు సెషన్‌ లలో స్టాక్స్ పతనం కావడంతో వందల కోట్ల రూపాయల సంపద గాల్లో కలిసిపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద ఆవిరిలా కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ అదానీ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది.

ఈ ఏడాదిలో ఎంత వేగంగా అదానీ గ్రూప్ షేర్లూ పెరిగాయో అంతకంటే వేగంగా తగ్గాయి. ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా ఆదానీ నిలిచారు. ఆయన సంపద ఏకంగా 62.1 బిలియన్ డాలర్స్(రూ.4,60,143 కోట్ల)కు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది కూడా అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ లో చైనా పారిశ్రామికవేత్త జాంగ్ షాన్షాన్ రెండో స్థానానికి ఎగబాకారు. అదానీ మూడో స్థానానికి పడిపోయారు. చైనా పారిశ్రామికవేత్త సంపద 6940 కోట్ల డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ సంపద 6760 కోట్ల డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ ఆస్తి 8450 కోట్ల డాలర్లు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో వరుసగా నష్టాపోయాయి. దాంతో గ్రూప్ మొత్తం మార్కెట్ వ్యాల్యూ గత రోజుల్లో రూ.1.59 లక్షల కోట్ల మేర తగ్గింది.

ఈ నెల 11వ తేదీన అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ వ్యాల్యూ రూ.9.51 లక్షల కోట్లు కాగా, 17వ తేదీ నాటికి రూ.7.92 లక్షల కోట్లకు పడిపోయింది. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీల షేర్లు ఈ నాలుగు రోజులు లోయర్ సర్యూట్‌ను తాకాయి. ఈ వారంలో గ్రూప్ షేర్లు 9 శాతం నుంచి 22 శాతం వరకు నష్టపోయాయి.