Begin typing your search above and press return to search.

20వేల కోట్ల FPO కు సిద్ధమైన 'అదానీ'.. ఆదరణ లభించేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:33 AM GMT
20వేల కోట్ల FPO కు సిద్ధమైన అదానీ.. ఆదరణ లభించేనా?
X
దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఆదానీలు ముందు వరుసలో ఉంటారు. వ్యాపార సామ్రాజ్యంలో అదానీ గ్రూప్స్ కు మంచి పేరు ఉంది. కరోనా సమయంలోనూ అదానీలకు చెందిన వ్యాపార సంస్థలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగడంతో లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందనే ప్రచారం జరిగింది.

అయితే అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ రీసెర్చ్ మాత్రం అదానీ గ్రూపు కంపెనీలన్నీ గాలి మేడలని ప్రకటించడంతో పరిస్థితి మొత్తం తలకిందులుగా మారింది. అదానీ గ్రూపుకు చెందిన షేర్లన్నీ గత వారం రోజులుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో వేల కోట్ల సంపద కొద్దిరోజుల్లోనే ఆవిరైంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కు భారీ నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒకవైపు కంపెనీ షేర్స్ పతనం అవుతుండగా మరోవైపు అదానీ వ్యాపారాలకు మూల కేంద్రమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కు వచ్చింది. సుమారు 20వేల కోట్ల సమీకరణ కోసం జనవరి 27 నుంచి ఎఫ్పీవోకు వచ్చింది. ఈ ఇష్యూ మంగళవారంతో ముగియనుంది. అయితే తొలి రోజు కేవలం ఒక శాతం మాత్రమే బుక్ అయినట్టు ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్స్ కొన్న వారికి వంద శాతం బుక్ బిల్డింగ్ కింద పార్ట్ లీ పెయిడ్ షేర్లను కంపెనీ జారీ చేస్తోంది. ఒక్కో షేరుకు రూ.3112 నుంచి 3276 ప్రైస్‌ బ్యాండ్‌తో ఆఫర్‌ చేస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరూ కనీసం నాలుగు షేర్లు కొనాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ షేర్లు ట్రేడ్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇటీవల ఆ కంపెనీ సంక్షోభం గురించి బయటపడటంతో ఒక్కో షేర్ కోసం రూ. 3112 నుంచి 3276 ప్రైస్‌ బ్యాండ్ పెట్టినా ప్రస్తుతం షేర్ ధర మాత్రం 2768 దగ్గరే ట్రేడ్ అవుతోందట. ఇది కూడా మరింత కుంగిపోయే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ ఎఫ్పీవోకు ఏమాత్రం ఆదరణ లభిస్తుందనే ఆసక్తి నెలకొంది.

సోమ మంగళ వారాలు అదానీ గ్రూపునకు అత్యంత కీలకమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 20వేల కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుకున్నట్లు మార్కెట్ ను శాసిస్తుందా? లేదా అన్నది త్వరలోనే తేలనుంది. ఏది ఏమైనా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ వెలువరించిన ప్రకటన మాత్రం అదానీ గ్రూప్ నకు తీరని నష్టాన్ని మిగిల్చినట్లే కన్పిస్తోంది



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.