Begin typing your search above and press return to search.

రాత్రి 11 గంటలకు వెళుతున్న నటిపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన

By:  Tupaki Desk   |   26 May 2022 3:26 AM GMT
రాత్రి 11 గంటలకు వెళుతున్న నటిపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
X
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన మలయాళ నటి అర్చనా కవికి పోలీసు కానిస్టేబుల్ కారణంగా చేదు అనుభవం ఎదురైనట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్న వైనం సంచలనంగా మారింది. పోలీసు వర్గాల్లో కలకలం రేపిన ఈ ఉదంతంపై తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణను చేపట్టటం.. దానికి సంబంధించిన వివరణను డీసీపీ స్వయంగా వెల్లడించటం గమనార్హం.

పలు మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ నటించిన అర్చన కవి.. ఆదివారం రాత్రి తన స్నేహితురాలు.. ఆమె పిల్లలతో కలిసి బయటకు వెళ్లారు.

రాత్రి పదకొండు గంటల వేళలో వారు ఇంటికి తిరిగి వచ్చేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో పెట్రోలింగ్ కు వచ్చిన కొచ్చి పోలీసులు వారి ఆటోను ఆపారు. ఒక కానిస్టేబుల్ వారి ఆటో వద్దకు వచ్చి.. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఈ పిల్లలు ఎవరు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగించారని ఆమె సోషల్ మీడియాలో వాపోయారు. ఆ సమయంలో సదరు కానిస్టేబుల్ తనను నమ్మటానికి సిద్ధంగా లేనట్లుగా అతని ప్రవర్తన ఉందన్నారు.

'మమ్మల్ని ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారు. ఈ ఘటన నన్నెంతో వేధించింది. దీనిపై పోలీసుల్ని నేను నిందించటం లేదు. వారి డ్యూటీ వారు చేశారంతే' అంటూ పెట్టిన పోస్టుపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇరు వర్గాల వాదనను విన్న అనంతరం విలేకరులతో మాట్లాడిన డీసీపీ.. "సినీ నటి.. పోలీసు కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నాం. రాత్రివేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. వారిని ఆపి ప్రశ్నించారు.

ఆ సమయంలో నటి ముఖానికి మాస్కు పెట్టుకోవటంతో గుర్తు పట్టలేదు. ఆ పరిస్థితుల్లో నటి అయినా.. సాధారణ మహిళ అయిన విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి దురుసుగా వ్యవహరించటం సరికాదు. ప్రశ్నలు అడిగే విషయంలో కానిస్టేబుల్ తన పరిది మీరి వ్యవహరించలేదు. అయితే.. నటి వెర్షన్ విన్న తర్వాత ప్రశ్నలతో ఆమె ఇబ్బంది పడ్డారని అర్థమైంది. అభద్రతా భావానికి లోనైనట్లుగా గుర్తించాం' అని పేర్కొన్నారు.

ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన పోలీసుల కారణంగా అభద్రతకు గురి కావటం సరికాదన్న డీసీపీ.. ఈ ఇష్యూలో కానిస్టేబుల్ కు సమన్లు జారీ చేయాల్సి వస్తే చేస్తామన్నారు. ఈ అంశంపై అంతర్గత విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. మొత్తంగా.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పే ఫ్రెండ్లీ పోలీసింగ్ కేరళలో కూడా అమలు చేస్తుంటే.. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇక్కడో విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలో నైట్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి ఏడు గంటలకే షాపులు బంద్ చేస్తుంటారు. చాలా త్వరగా నిద్రపోయే స్వభావం మలయాళీలు ఇప్పటికి పాలో అవుతారు. కేరళలోని ప్రధాన నగరాలు.. పట్టణాల్లోరాత్రి ఎనిమిది గంటల వేళకు రోడ్లు మొత్తం ఖాళీ కావటం కనిపిస్తుంటుంది. ఇలాంటి వేళ రాత్రి పదకొండు గంటలకు ఆటోలో వెళుతున్న వారిని కానిస్టేబుల్ ఆపి.. ప్రశ్నించటం తప్పు లేదన్న మాట వినిపిస్తోంది.