ఇప్పటిదాకా పెద్దల సభకు ఎంపికైన తెలుగు నటులు వీరే!

Thu Jul 07 2022 11:00:01 GMT+0530 (IST)

Actors Nominated for Rajya Sabha

రాజ్యసభకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎంపికైన పలువురి సరసన విజయేంద్ర ప్రసాద్ కూడా చేరారు. ఇప్పటివరకు తెలుగునాట పలువురు నటీనటులు రాజ్యసభకు ఎంపికయిన సంగతి తెలిసిందే.గతంలో సుప్రసిద్ధ విలన్ గా పేరు గడించిన రావు గోపాలరావు దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రముఖ నటీనటులు మోహన్ బాబు చిరంజీవి జయప్రద కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే ప్రముఖ నిర్మాతలు టి.సుబ్బిరామిరెడ్డి డి.వెంకటేశ్వరావు ప్రముఖ గీత రచయిత సి.నారాయణరెడ్డి కూడా రాజ్యసభకు ఎంపికై సభ్యులుగా పనిచేశారు.

అయితే వీరంతా వివిధ పార్టీల తరఫున రాజ్యసభకు ఎంపిక కావడం గమనార్హం. దాసరి నారాయణరావు చిరంజీవి సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఇక రావు గోపాలరావు జయప్రద డి.వెంకటేశ్వరరావు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభలో చోటు దక్కించుకున్నారు. ఇక సి.నారాయణరెడ్డిని రాష్ట్రపతి తన కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కూడా రాష్ట్రపతి కోటాలోనే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

కాగా వీరిలో ఒక్క సుబ్బిరామిరెడ్డి మినహా మిగిలినవారంతా రెండో పర్యాయం రాజ్యసభకు అవకాశం దక్కించుకోలేకపోయారు. సుబ్బిరామిరెడ్డిని మినహాయించి మిగిలినవారంతా ఒక్క పర్యాయం మాత్రమే రాజ్యసభకు ఎంపికయ్యారు.

కాగా ప్రస్తుతం కేరళ నుంచి ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయనను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక బాలీవుడ్ నుంచి జయాబచ్చన్ (అమితాబ్ బచ్చన్ సతీమణి) రేఖ తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.