Begin typing your search above and press return to search.

34 ఏళ్లకే రిటైర్మెంట్ రహస్యం చెప్పిన బింద్రా

By:  Tupaki Desk   |   13 Aug 2022 9:30 AM GMT
34 ఏళ్లకే రిటైర్మెంట్ రహస్యం చెప్పిన బింద్రా
X
షూటింగ్ అంటేనే ఓ ఖరీదైన క్రీడ.. సామాన్యులు కలలో కూడా ఊహించలేని ఆట.. అందులోనూ ఇక ఒలింపిక్స్ స్థాయికి వెళ్లడం 90 శాతం మంది షూటర్లకు తీరని కలే. మధ్య తరగతి జనం అధికంగా ఉండే భారత్ లాంటి దేశాల్లో అయితే షూటింగ్ కు అసలు ఆదరణే లేదు. కాకపోతే.. అన్ని ఆటలను కొందరు కొందరు ఇష్టపడినట్లే షూటింగ్ నూ ఇష్టపడే వారు కొందరుంటారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడే అభినవ్ బింద్రా. అసలు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యమే కష్టమైన క్రీడలో ఏకంగా బంగారు పతకం తెచ్చాడీ షూటర్.

ఇదంతా 2008 ఒలింపిక్స్ లో జరిగింది. నాడు ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది చైనా. ఆ దేశ రాజధాని బీజింగ్ లో పోటీలు మహా అట్టహాసంగా జరిగాయి. పొరుగున ఉన్న మన దేశం పతకాల పట్టికలో సెంచరీ కొడితే.. భారత్ కు దక్కింది మాత్ర మూడే మూడు. అందులో ఒక బంగారు పతకం. రెండు కాంస్యాలు. ఇక ఆ ఏకైక బంగారు పతకం సాధించింది అభివన్ బింద్రా. ఎందుకనో గాని తర్వాతి ఒలింపిక్స్ లో అతడు ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 2016 నాటికి మరీ వెనుకబడిపోయాడు. 2017లో ఏకంగా రిటైర్మెంటే ప్రకటించాడు.

ఆ స్వర్ణం.. ఎన్నటికీ మురిపెం

బింద్రా అంటేనే గుర్తుకువచ్చేది బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో అతడు గెలిచిన స్వర్ణం. అది ఎందుకంత మురిపెం అంటే.. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు దక్కిన తొలి స్వర్ణం కాబట్టి. అందులోనూ కలలోనైనా ఊహించని షూటింగ్ వంటి క్రీడల్లో లభించిన బంగారు పతకం కావడంతో మన దేశానికి ఎప్పటికీ మణిహారంగా మిగిలిపోనుంది. అలా షూటింగ్ లో స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా అభినవ్‌ బింద్రా చరిత్ర లిఖించాడు. అందుకే క్రీడాభిమానులు అంత తొందరగా అభివన్‌ బింద్రా పేరు మరిచిపోలేరు. 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ ఈవెంట్‌లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా 2017లో 34 ఏళ్ల వయసులోనే బింద్రా అధికారికంగా షూటింగ్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. రిటైర్మెంట్‌కు ముందు జరిగిన 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికి అభినవ్‌ బింద్రా పతకం సాధించలేకపోయాడు. నాలుగో స్థానంతో సరిపెట్టకున్నాడు.

మరో పతకం తేకున్నా.. అద్భుత ప్రేరణగా నిలిచాడు

నిజానికి బింద్రా 2008 ఒలింపిక్స్ లో బంగారు పతకం తేకుంటే భారత్ పరువు గంగలో కలిసేదే. ఆ టోర్నీలో భారత్ సాధించిన మిగిలిన రెండు పతకాలు కాంస్యాలే. పతకాల పట్టికలో సెంచరీ కొట్టి చైనా నంబర్ వన్ (మొత్తం 100 పతకాలు- స్వర్ణం 48, రజతం 22, కాంస్యం 30) గా నిలిస్తే మన మాత్రం 51 స్థానంతో సరిపెట్టుకున్నా. అది కూడా బింద్రా సాధించిన స్వర్ణంతో పరువు దక్కింనందునే. లేదంటే.. 81వ స్థానానికి పడిపోయేవారం. నాడు ఒలిపింక్స్ లో 82 దేశాలు పాల్గొన్నాయి. అంటే.. చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉండేవారం. అయితే, బింద్రా తన గురి తప్పని షూటింగ్ తో భారత్ ను గౌరవప్రద స్థానానికి చేర్చాడు.

నాటి అతడి ఈ పోరాటమే ఇప్పటికీ అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తోంది. గతేడాది ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడంటే దాని వెనుక బింద్రా స్పూర్తి లేదని చెప్పలేం. బర్మింగ్‌హమ్‌లో ఇటీవల జరిగిన 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి గేమ్స్‌లో 61 పతకాలు సాధించిన భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా ఖాతాలో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బింద్రా స్పందించాడు.'' కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. ఈసారి పతకాలు సాధించిన వారిలో ఎక్కువమంది అథ్లెట్ల జీవితాలు అందరికి ఆదర్శప్రాయం కావడం జాతికే గర్వకారణం. మనందరం భారతీయులం.. ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం'' అంటూ పేర్కొన్నాడు.

రిటైర్మెంట్ ఎందుకంటే..?

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సంపన్నుల కుటుంబంలో జన్మించిన బింద్రా పద్మ భూషణ్, అర్జున అవార్డుల గ్రహీత. సరిగ్గా 14 ఏళ్ల కిందట 2008 ఆగస్టు 11న అతడు బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచాడు. ఆర్థికంగానూ సంపన్న కుటుంబానికి చెందిన అతడు మరికొన్నాళ్లు క్రీడలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ తప్పుకొన్నాడు. అయితే, తాజాగా బర్మింగ్ హామ్ లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారులను బింద్రా అభినందించిన కొద్దిసేపటికే ఓ అభిమాని స్పందించాడు. ఇంత తొందరంగా రిటైర్ ఎందుకు అయ్యారని ప్రశ్నించాడు. దీనికి 39 ఏళ్ల బింద్రా సూటింగా జవాబిచ్చాడు. తన నైపుణ్యం తగ్గిందనే అంచనాకు వచ్చానని, దేశానికి రెండోసారి పతక సాధనలో విఫలమయ్యానని, కొత్తవారికి మరిన్నిఅవకాశాలు ఇచ్చేందుకే తాను ఆటనుంచి తప్పుకొన్నానని వివరంగా చెప్పాడు. అంతేకాక మన దేశంలో ప్రతిభ అపారంగా ఉందని.. దానిని దెబ్బతీయకుండా ప్రోత్సహించడమే లక్ష్యమని చెప్పాడు.

సరైన నిర్ణయమే..

బింద్రా 34 ఏళ్లకే రిటైర్ అవడం మనలాంటి వారికి ఆశ్చర్యంగా అనిపించినా.. అది సరైన సమయంలో సరైన నిర్ణయమే. షూటింగ్ అంటే మామూలు క్రీడ కాదు. సాధారణ క్రీడల కంటే పలు రెట్లు ఏకాగ్రత అవసరం. అందులో ఏమాత్రం తేడా వచ్చినా వైఫల్యమే. ఎందుకనోగాని బింద్రా తర్వాతి ఒలింపిక్స్ లో తన స్థాయిని తానే అందుకోలేకపోయాడు. ఇవన్నీ పరిగణించి.. తన కారణగా మరొకరి అవకాశాలు దెబ్బపడడం ఇష్టం లేక గౌరవంగా తప్పుకొన్నాడు.