వలపు వలతో సైన్యానికి ఎర కేసులో మరొకరి అరెస్ట్!

Sun Jun 07 2020 10:57:35 GMT+0530 (IST)

Abdul Rahaman Held in visakhapatnam honey trap case

అమ్మాయిల పేరుతో సోషల్ మీడియా.. వ్యక్తిగతంగా కలిసి దేశ సైనికులను తమ వలలో వేసుకుని దేశ రహాస్యాలను తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) అడ్డుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ కుటిల బుద్ధికి పాఠం చెప్పింది. దీన్నే హనీట్రాప్ కేసుగా పేర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా తాజాగా మరొక కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15మందిని అరెస్ట్ చేశారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాకిస్తాన్ యువతుల హనీ ట్రాప్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. విశాఖపట్నం గూఢచర్యం కేసులో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు షేక్ అబ్దుల్ రెహమాన్ జబ్బార్ ను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో అబ్దుల్ రెహమాన్ భార్య షయిత్సా కాజిర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

విశాఖపట్టణం నౌకదళం (నేవీ ఫోర్స్) కేంద్రంగా సాగిన హనీట్రాప్ వ్యవహారం గతేడాది డిసెంబర్ 20వ తేదీన బట్టబయలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేర్లతో విశాఖ నేవీ దళ సభ్యులకు ఎరవేసి దేశ రహాస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఈ కుట్రను పసిగట్టిన ఎన్ ఐఏ వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

ఈ విచారణలో భాగంగా గతేడాది డిసెంబర్ 29వ తేదీన విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఐసీపీ సెక్షన్ 120బీ - 121ఏ - యుపీ (ఏ) చట్టం సెక్షన్ 17 - 18 - అధికారిక రహాస్యాల చట్టంలోని సెక్షన్ 3 కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ లోనే 11 మంది నేవీ అధికారులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు మరొక సూత్రధారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా అతడి వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లు - ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి ద్వారానే నేవీ అధికారులకు డబ్బులు అందినట్లు ఎన్ ఐఏ నిర్ధారణ చేసింది. ఈ వ్యక్తితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 మందిని ఎన్ ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.