మెజిస్ట్రేట్ స్టిక్కర్ కారులో ఈవీఎం తరలింపు.. దుమారం

Fri Feb 11 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Abandoned EVM found in car without number plate

యూపీ ఎన్నికల్లో అక్రమాలు సాగుతున్నాయా? ప్రజలు ఓట్లేసిన ఈవీఎంలను అక్రమంగా తరలిస్తున్నారా? తాజాగా మెజిస్ట్రేట్ పేరుతో ఉన్న ఒక కారులో ఏకంగా ఈవీఎం బయటపడడం కలకలం రేపింది. ఇది ఎక్కడిది? ఎవరు తీసుకెళుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. దీంతో యూపీ సర్కార్ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.యూపీ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అధికార బీజేపీ ప్రతిపక్ష సమాజ్ వాదీ బీఎస్పీ కాంగ్రెస్ లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ ముగిసింది.  అయితే ఓటింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం నంబర్ ప్లేట్ లేని ఓ కారులో ఈవీఎం యంత్రం కనిపించడం వివాదాస్పదమైంది.

యూపీలోని కైరానా వద్ద షామ్లీ-పానిపట్ హైవేపై నంబర్ ప్లేట్ లేని కారులో ఈవీఎం యంత్రాన్ని సమాజ్ వాదీ పార్టీకిచెందిన నేతలు గుర్తించారు. సదురు కారు ‘కైరానా మేజిస్ట్రేట్ స్టిక్కర్’తో ఉండడంతో ఎస్పీ నేతలు ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ కారులోని ఈవీఎంను తెరిచి పరిశీలించారు.

ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని మెజిస్ట్రేట్ అంగీకరించారు. దీంతో ఎస్సీ నేతలు ఈ పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఈవీఎం గోల్ మాల్ పై జోనల్ మెజిస్ట్రేట్ కారులో ఈవీఎం యంత్రం ఉండడం నిజమేనన్నారు. అయితే కారు డ్రైవర్ భోజనం చేయడానికి వెళ్లిన సమయంలోనే ఈవీఎంను కారులో పెడుతున్న విషయాన్ని తాము గమనించామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.