వెంకయ్యనాయుడిని బాధపెట్టిన హీరోగారు

Sun Jan 31 2016 15:01:09 GMT+0530 (IST)

Aamir Khan Remarks On Intolerance Hurt Me Says Venkaiah Naidu

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ హీరో మాటలకు నొచ్చుకున్నారట... చాలా బాధపడ్డానని కూడా ఆయన చెబుతున్నారు. ఇంతకీ ఎవరా హీరో... ఏంటా కథ అంటే అదంతా కొద్ది నెలల కిందట జరిగిన పరిణామం. కొద్దినెలల కిందట బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అసహనంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అసహనం పెరిగిపోయిందని... అందువల్ల తన భార్య కూడా ఇక్కడ ఉండేందుకు భయపడుతోందని... పిల్లల భవిష్యత్తు దృష్ట్యా భారత్ ను వీడి ఏదైనా ఇతర దేశంలో తలదాచుకుందామని అంటోందని గతంలో అమీర్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను పట్టుకుని విపక్షాలను ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించాయి. మరోవైపు అమీర్ కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.  ఈ దేశం నుంచి అన్నీ పొంది దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ అమీర్ పై ఎందరో విరుచుకుపడ్డారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్య కూడా అమీర్ వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు... అమీర్ తనకు మంచి స్నేహితుడని... కానీ ఆయన ఆ రోజు అన్న మాటలతో తాను బాధపడ్డానని చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఛాత్ర సంసద్ కార్యక్రమంలో ట్విట్టర్ లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా అమీర్ వ్యాఖ్యలపైనా ఓ ప్రశ్న రాగా వెంకయ్య తాను బాధపడిన సంగతిని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన అమీర్ వ్యాఖ్యలను పట్టుకుని రాద్ధాంతం చేయబోయిన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.