సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఏపీ?

Sun May 16 2021 17:00:50 GMT+0530 (IST)

AP towards complete lock down?

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే పూర్తి లాక్ డౌన్ దిశగా సాగుతున్నట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పౌరులను బయటకు అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు ఇతర వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా అమలు చేస్తున్న కర్ఫ్యూతో పెద్దగా ఉపయోగం ఉన్నట్టు కనిపించడం లేదు.రోజురోజుకు ఏపీలో పెరిగిపోతున్న కేసులతో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడిపోయింది. పైగా దేశంలోనే అత్యధిక పాజిటివిటీ ఉన్న రాష్ట్రంగా ఏపీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్ విధించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

లాక్ డౌన్ విధించాలంటే ఏదైనా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10శాతం దాటొద్దు. కానీ ఏపీలో ప్రస్తుతం పాజిటివ్ కేసులు 20శాతానికి చేరుకున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇంకా కేసులు భారీగానే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఆశించిన ప్రయోజనం దక్కదని అధికారులు అంటున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు.

ఏపీలోని 11 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతానికి చేరుకుంది. ఎంత కట్టడి చేసినా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. మరీ ముఖ్యంగా విశాఖ తూర్పు గోదావరి అనంతపురం జిల్లాలో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. ఇక కేంద్రం కూడా ఏపీలో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఏకంగా 30శాతం వరకు ఉందని తెలిపింది. దేశంలోనే అత్యధిక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. దీంతో వెంటనే రాష్ట్రం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం తప్ప మరో మార్గం లేదంటున్నారు.