Begin typing your search above and press return to search.

బాగుందీ వరస... రాజకీయ పదనిస...

By:  Tupaki Desk   |   22 Oct 2021 1:30 PM GMT
బాగుందీ వరస... రాజకీయ పదనిస...
X
వన్ సైడ్ లవ్ అంటూ అప్పట్లో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తే జనాలు విపరీతంగా ఆదరించారు. ఏపీ రాజకీయాల్లో ఇపుడు అదే జరుగుతోంది అనుకోవాలి. అధికార వైసీపీ తాను సోలోగానే అంటూ క్లారిటీ పక్కాగా ఇచ్చేసింది. ఇక ప్రతీ ఎన్నికకూ పొత్తుల కోసం ఎత్తులు వేస్తే టీడీపీ మాత్రం అతి పెద్ద పొలిటికల్ జంక్షన్లో ఇపుడు ఉంది. ఆ పార్టీ సీన్ ఈ రోజుకు అయితే సింగిలే. పవన్ కళ్యాణ్, జనసేన తమ వైపే అని చెప్పుకుంటున్నా టీడీపీ బంద్ మీద అయితే అ పార్టీ స్పందించలేదు, ఇక చంద్రబాబు ఈ వయసులో 36 గంటల దీక్ష చేస్తున్నా రెస్పాండ్ కాలేదు. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు టీడీపీ ఆఫీసుల మీద దాడిని ఖండించినా బాబు మార్క్ రాష్ట్రపతిపాలన వంటి భారీ డిమాండ్ల మీద మాట్లాడడంలేదు.

ఇదే సమయంలో సీపీఐ మాత్రం బాగానే రాసుకుపూసుకుంటోంది అన్న కామెంట్స్ వస్తునాయి. ఏకంగా టీడీపీ ఆఫీస్ ని సందర్శించి సీపీఐ రామక్రిష్ణ అధికార వైసీపీ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని చెబుతూ తాము టీడీపీకి తోడుగా ఉంటామని చెప్పేశారు. ఇక సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే చంద్రబాబుకు ఫోన్ చేసి తాను నేరుగా కలవలేకపోతున్నాన్ని చెప్పుకున్నారు. టీడీపీ చేస్తున్న పోరాటానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నారాయణ ఇక మీదట కలసికట్టుగా మరింత గట్టిగా పోరు చేద్దామని చెప్పేశారు.

ఇలా కమ్యూనిస్ట్ పార్టీ బాబుకు అవుట్ రేట్ గా మద్దతు ఇస్తూంటే చంద్రబాబు మాత్రం ఢిల్లీ వైపు చూస్తున్నారు. నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలనుకుంటున్నారు. ఏపీ పరిణామలను వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయబోతున్నారు. ఇలా ఏపీ పరిణామాల మీద ఫిర్యాదు అని బయటకు అంటున్నా బీజేపీతో కలసి ప్రయాణం చేయడానికి ఇది తొలి అడుగుగా మార్చుకోవాలని బాబు చూస్తున్నారు అన్నదే అందరి విశ్లేషణగా ఉంది.

అంటే బాబు బీజేపీ వైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. అదే టైమ్ లో సీపీఐ టీడీపీ వైపు చూస్తోంది. మొత్తానికి బీజేపీ కనుక సరేనని అంటే టీడీపీ కచ్చితంగా మరో మారు ఆ పార్టీతోనే పొత్తులు పెట్టుకుంది. అపుడు సీపీఐ ఏమవుతుంది అన్నదే ఇక్కడ చర్చ. బాబు మీద అతి నమ్మకంతో బాహాటంగా మద్దతు ఇస్తున్న సీపీఐ రెండవ వైపు చూడడం లేదని, 2014 నాటి పొత్తులే ఏపీలో రిపీట్ అయితే సీపీఐ సంగతేంటి అన్న ప్రశ్నకు ఎర్రన్నల వద్ద నికరమైన జవాబు ఉందా అన్నదే పాయింట్ మరి. మొత్తానికి ఏపీలో విపక్షాలు తీరు వరస భలే బాగుంది అనాలేమో.