నిమ్మగడ్డ జోరుకు ప్రధాని బ్రేకులు వేసినట్లేనా?

Wed Nov 25 2020 14:40:02 GMT+0530 (IST)

AP local body elections

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిపేద్దామని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ఆతృత పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెబుతున్నారు. అయితే సాహ్ని చెబుతున్న మాటలను నిమ్మగడ్డ పట్టించుకోవటం లేదు. ఎంతసేపు తన పంతం నెగ్గించుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్న పట్టుదలతో పదే పదే సాహ్నీకి లేఖలు రాస్తున్నారు.ఈ నేపధ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్-19 ఎదుర్కోవటంలో రాష్ట్రప్రభుత్వాలు అభిప్రాయాలు చాలా విలువైనవన్నారు. వైరస్ ను ఎదుర్కోవటంలో ప్రభుత్వాలు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను ఉపయోగించుకోవాలని గట్టిగా చెప్పారు. కోవిడ్ ను ఎదుర్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగ్గానే పనిచేస్తున్న తీసుకుంటున్న చర్యలు సరిపోవన్నారు.

కరోనా వైరస్ కు విరుగుడుగా టీకాల ప్రయోగాలు జరుగుతున్నాయని క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని అలుసుగా తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. ఎట్టిపరిస్ధితుల్లోను వైరస్ ను నిర్లక్ష్యం చేయవద్దని గట్టిగా  చెప్పారు. సరే ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్న అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ నిమ్మగడ్డ వ్యవహారమే ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారన్న ఏకైక కారణంతో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టటానికి వెనకాడటం లేదు.

వాయిదా పడిన స్ధానిక సంస్దల ఎన్నికలను నిర్వహించేసేందుకు తెగ తొందరపడిపోతున్నారు. చీటికి మాటికి న్యాయస్ధానాల ఆదేశాలున్నాయని రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమీషన్ ను ప్రభుత్వం లెక్క చేయటం లేదంటు గోల పెట్టేస్తున్నారు.  అయినదానికి కాని దానికి కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో కమీషన్ దే తుది నిర్ణయమని ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం కమీషన్ కు లేదంటు పదే పదే చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే చికాకులు పెడుతున్నారు.

మరి ఈ నేపధ్యంలో ప్రధాని రాష్ట్రాలకు చెప్పిన మాటలను చేసిన హెచ్చరికలను అయినా నిమ్మగడ్డ పట్టించుకుంటారా. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే సుప్రింకోర్టు కూడా చెప్పింది. దేశంలోని  చాలా రాష్ట్రాల్లో   మళ్ళీ  కరోనా వైరస్ విజృభిస్తోందంటూ  ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రింకోర్టు ప్రధానమంత్రి ఆందోళనలను హెచ్చరికలను చూసిన తర్వాతైనా నిమ్మగడ్డ తన పంతాన్ని వీడుతారా ? లేకపోతే తన ధోరణి తనదే అని మళ్ళీ మళ్ళీ లేఖలు రాస్తునే ఉంటారా ?  చూడాల్సిందే ఏం చేస్తారో.