Begin typing your search above and press return to search.

నిన్న నిమ్మగడ్డతో వరుస భేటీలు.. అసలేం జరిగింది? ఏమని తేల్చారు?

By:  Tupaki Desk   |   29 Oct 2020 7:50 AM GMT
నిన్న నిమ్మగడ్డతో వరుస భేటీలు.. అసలేం జరిగింది? ఏమని తేల్చారు?
X
ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. కరోనా ప్రారంభ వేళ.. స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మొగ్గు చూపటం.. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నో చెప్పి.. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే. ఇదిలా ఉంటే.. తాజాగా స్థానిక సంస్థలకు ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవటంతో పాటు.. ప్రభుత్వం ఏమేం ఆలోచిస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశాన్ని నిర్వహించారు. ముందు చెప్పినట్లే ఏపీ అధికారపక్షం ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరో నాలుగు పార్టీలు సమావేశానికి హాజరు కాలేదు. అందులో టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఉన్నాయి.

సమావేశమైన పదకొండు పార్టీల్లో తొమ్మిది గతంలో జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసి.. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరగా.. మిగిలిన రెండు పార్టీలు మాత్రం.. ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న సూచన చేశాయి. ముందు నుంచి తమ వాదనను వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం.. రెండు.. మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నప్పుడు ఎన్నికల్ని వాయిదా వేసి.. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న వేళలో మాత్రం ఎన్నికల్ని నిర్వహించటం సరికాదని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ పలువురు నేతలు తమ పార్టీ లైన్ చెప్పేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను ఏపీ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏమంటుందన్న విషయాన్ని వివరించారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఎన్నికలు జరగాల్సిందేనని స్పష్టం చేసిన ఆమె.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలని అనుకోవటం లేదని చెప్పినట్లు సమాచారం.

స్థానిక సంస్థలకు గతంలోజారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి.. కొత్తగా జారీ చేయాలని చెబుతున్నారు. అదే జరిగితే.. గతంలో పెద్ద ఎత్తున జరిగిన ఏకగ్రీవాలన్ని చెల్లుబాటు కాకుండా పోతాయి. అదే జరిగితే.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల విషయంపై పార్టీలతో సమావేశమైన నిమ్మగడ్డ సైతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో లేనట్లు చెప్పినట్లుగా చెబుతున్నారు. పార్టీల అభిప్రాయంతో పాటు.. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. అనధికారికంగా వస్తునన ఈ సమాచారం ఎంతవరకు నిజమన్నది నిమ్మగడ్డ అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప ఈ ఇష్యూపై క్లారిటీ రాని పరిస్థితి.