వైజాగ్‌లో సీఎం గెస్ట్ హౌస్ స్టే పై సుప్రీం మెట్లు ఎక్కిన ఏపీ సర్కార్ !

Sat Nov 21 2020 21:00:18 GMT+0530 (IST)

AP govt climbs Supreme Court steps on CM Guest House stay in Vizag

ఏపీలో అధికారంలో కి వచ్చిన తర్వాత సీఎం జగన్ తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం మూడు రాజధానులు. రాష్ట్రం వేగంగా నలువైపులా అభివృద్ధి చెందాలి అంటే మూడు రాజధానులు అవసరం అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకి సిద్ధమైంది. అయితే ఆ తర్వాత ఆ పక్రియ అంత వేగంగా ముందుకు సాగలేదు. అడుగడుగునా అడ్డంకులే. ఇదిలా ఉండగానే విశాఖపట్నం నుండి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా అక్కడ ఓ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు..విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చింది.తాజాగా నేడు దానిపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రాజధానుల వ్యవహారం తేలాలంటే ఇంకా కొద్దిగా సమయం పట్టేలా ఉండటంతో ఆ లోపు విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖలో సీఎం కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణం చేయకుండా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలుమార్లు విచారణ జరిగినా తుది నిర్ణయం మాత్రం వెల్లడికాలేదు.

దీనితో ఇంకా స్టే కొనసాగుతోంది. హైకోర్టు లో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో దీన్ని సవాలు చేసింది.విశాఖలో సీఎం గెస్ట్‌హౌస్ నిర్మాణానికి అనుమతివ్వాలని సుప్రీంను కోరింది. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది. ఇక మరోవైపు మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావస్తున్నా దానిపై ఓ క్లారిటీ అంటూ రావడం లేదు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులను గవర్నర్ హరిచందన్ ఆమోదించి గెజిట్ విడుదల చేసినా వాటి అమలు ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతుంది.