పోలవరంతో ఒడ్డెక్కుదామనుకుంటున్న జగన్... ?

Wed Jul 21 2021 16:10:16 GMT+0530 (IST)

AP government is working hard to complete the Polavaram project on time

పోలవరం ఇపుడు మళ్ళీ హాట్ టాపిక్ గా ఉంది. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి  పూర్తి చేసే విషయంలో ఏపీ సర్కార్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2022 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందే అంటోంది జగన్ సర్కార్. అంటే అప్పటికి ఇంకా రెండేళ్ళ పాటు అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ చిక్కు అంతా పునరావాస ప్యాకేజి తోనే వస్తోంది. పోలవరం శరవేగంగా పూర్తి అవుతుంది. ఆ తరువాత వచ్చే గోదావరి  వరద నీటిని ఎటు వదుల్తారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. వరద నీటి ముంపు నేపథ్యంలో పోలవరం చుట్టు పక్కన ఉన్న గ్రామాలన్నీ ఖాళీ చేయించాలి. వాటిని ఖాళీ చేయించి పునరావాసం కల్పించాలి అంటే అక్షరాలా రు. 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కేంద్రం ఈ నిధులు ఇవ్వాలి. సరిగ్గా ఇక్కడే కేంద్రం తెలివిగా సైడ్ అవుతోంది.పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. అదిగో కట్టించామని చెబుతోంది. పునరావాసంతో తమకు సంబంధంలేదని అంటోంది. దీంతో సీఎం అయిన రెండేళ్లకు జగన్ లో కదలిక వచ్చింది. మెల్లగా కూర్చుంటే అసలు పట్టించుకోరు అన్నది గ్రహించి పార్లమెంట్ లో గట్టిగానే గొడవ చేయిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కేంద్రాన్ని ఏ విషయంలోనూ ఒత్తిడి చేసేందుకు ఇష్టపడడం లేదు. ఇక ఇప్పుడు కూర్చొని చూస్తే పనులు అవ్వవన్న విషయం జగన్కు బోధపడింది. తన పార్టీ ఎంపీలకు ప్లే కార్డులు ఇచ్చి మరీ కేంద్రం మీద పోరాటానికి పంపుతున్నారు.

పోలవరం విషయంలో ఇలాగ కనుక ఊరుకుంటే కేంద్రం ఆర్ ఆర్ ప్యాకేజిని ఇచ్చే ప్రసక్తే లేదని తెలియడంతోనే జగన్ ఈ దూకుడు చూపిస్తోన్న పరిస్థితి. ఇప్పటి నుంచి ఆఘమేఘాల మీద పనులు చేస్తే గాని 2024 ఎన్నికలకు ముందు పోలవరం పూర్తవుతుందో ?  లేదో ?  చెప్పలేని పరిస్థితి. ఒక వేళ పూర్తి కాకపోతే ఏపీలో ప్రతిపక్షాలే కాదు.. సాధారణ ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలే జగన్ను చుట్టుముడతాయి. పోలవరం పూర్తి అయింది అని చెప్పుకోవడానికైనా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికైనా కూడా ముందు ఆర్ ఆర్ ప్యాకేజ్ సమస్య తీరాలి.

అక్కడ ఉన్న వారందరినీ వేరే చోటకు తరలించి వారికి స్థిర ఆవాసాలు కల్పించాలి. అపుడే పోలవరం పూర్తి అయినట్లు. అందుకే జగన్ కూడా తొందర పడుతున్నారు. తన ఏలుబడిలో పోలవరం ప్రాజెక్ట్ అయింది అని చెప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలల్లో క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే జగన్ అడుగుతున్నట్లుగా కేంద్రం ఆర్ ఆర్ ప్యాకేజ్ కి అంగీకరించి నిధులు మంజూరు చేసినపుడే ఇది సాధ్యపడుతుంది. మరి జగన్ కి రాజకీయ ప్రయోజనం వచ్చే ఈ పధకం విషయంలో బీజేపీ పెద్దలు అంత ఈజీగా నిధులు ఇస్తారా ? అన్నది కూడా చూడాలి.