Begin typing your search above and press return to search.

మాస్టారు అంటే భయమా సారూ...?

By:  Tupaki Desk   |   1 Dec 2022 9:02 AM GMT
మాస్టారు అంటే భయమా సారూ...?
X
ఒక్క బెత్తం దెబ్బతో తరగతి గదిలో క్రమశిక్షణను తీసుకువచ్చే మాస్టారు అంటే అందరికీ భయం ఉంటుంది. ఏ స్థాయిలో సమాజంలో పదవులు అందుకున్న వారు అయినా ముందుగా తమకు చదువులు చెప్పిన గురువులనే తలచుకుంటారు. ఏ రంగంలో రాణించాలి అన్నా మాస్టారు ఉండాల్సిందే. మరి ఆ గురువులు బరువు అయ్యారూ అంటే బెత్తం దెబ్బలకు భయమేనా ఉండాలి లేక వారి క్రమశిక్షణ తమకు శిక్షగా మారుతుంది అన్న వెరపేనా ఉండాలి.

ఏపీలో వైసీపీ సర్కార్ విద్యా హక్కు చట్టంలో మార్పులు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం చూస్తే ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోరాదని నిర్ణయించింది. అంటే వారు కేవలం బోధక కోసం మాత్రమే ఉండాలని నిర్దేశించినట్లు అయింది.
పైకి చూస్తే ఇది మంచి నిర్ణయంగా ఉన్నా లోపల చూస్తే రాజకీయ కారణాల వల్లనే ఇలా చేశారా అన్న చర్చ మొదలైంది. దీని మీద చాలా మంది ఉపాధ్యాయ నేతలతో పాటు మేధావులు సైతం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలన్న కుట్ర ఇందులో దాగుంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే మూడున్నరేళ్ల వైసీపీ పాలన మీద పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నది ఉపాధ్యాయ వర్గాలే అని అంటున్నారు.

వారి సమస్యల మీద ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ కాకపోవడం సీపీఎస్ రద్దు వంటి అంశాలు అలాగే ఉండడం, ఫిట్ మెంట్ లో వారు కోరుకున్నది ఇవ్వకపోవడం, డీఏలు బకాయి పెట్టడం, పీఆర్సీ విషయంలో పేచీలు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణలో అనేక యాప్ లను పెట్టి వారిని ఇబ్బందుల పాలు చేయడం వంటివి ఉన్నాయి. దాంతో వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఈ ఏడాది మొదట్లో ఉపాధ్యాయులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది పూర్తి సక్సెస్ కావడంతో ప్రభుత్వం ఇబ్బందులో పడింది. ఇక ఉద్యోగులు ఎంతో కొంత తగ్గినా కూడా ఉపాధ్యాయులు మాత్రం ఈ రోజుకీ సీపీఎస్ రద్దు వంటి వాటి మీద పట్టు బట్టి ఉన్నారు. మరి ఈ కారణాలతోనే వారిని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలని ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో సవరణలు చేసిందా అన్న చర్చ అయితే వస్తోంది.

ఉపాధ్యాయులు ఎన్నికల విధులలో ఉంటే కనుక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అది ఇబ్బందిగా మారుతుందని ముందస్తు ఆలోచనలతోనే వారి విషయంలో ఈ రకంగా సవరణలు తెచ్చారని అంటున్నారు. దీని మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఒక మీడియా డిబేట్ లో మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్నదే ఇందులో కనిపిస్తోంది అని అంటున్నారు. నిజంగా ప్రభుత్వానికి బోధనేతర బాధ్యతలలో ఉపాధ్యాయులను ఉంచి అవస్థల పాలు చేయకూడదు అనుకుంటే పాఠశాలలో తీసుకువచ్చిన అనేక యాప్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల విధులలో భాగస్వామ్యం అవుతున్నారని, వారు క్రమశిక్షణతో ఉంటారని, ఎవరినీ ప్రభావితం చేసే అవకాశం అసలు ఉండని కూడా అంటున్నారు. ఇక సీసీ కెమెరాలతో ఎన్నికలు జరుగుతాయని, అందువల్ల కనీసం ఈవీఎంల దాకా కూడా ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులు సహా ఎవరూ వెళ్లే అవకాశం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఉపాధ్యాయులు తమ సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిగ్గదీయడం వల్లనే వారిని ఈ విధంగా ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలని అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా టైం లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించారని, దాని వల్ల 976 మంది ఉపాధ్యాయులు కరోనా సోకి మరణించారని ఆయన గుర్తు చేశారు. అయినా తెగించి వారు ఎన్నికలను జరిపించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలతో ఉపాధ్యాయులతో సహా ఏ ఉద్యోగి సంతృప్తిగా లేరని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా చూస్తే మంత్రులు ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో వారిని కించపరచే విధంగా మాట్లాడుతున్నారని, ఇది తప్పు అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం, కేంద్రం ఎంత వరకూ అంగీకరిస్తాయన్నది చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తానికి చూస్తే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించడం వెనక రాజకీయ కోణం ఉందనే భావన అయితే అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే మరింత చిత్తశుద్ధితో ఉపాధ్యాయులు బోధన మీద తమ దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం అని సమర్ధించుకుంటోంది. చూడాలి మరి ఎవరి వాదనలో నిజముందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.