Begin typing your search above and press return to search.

ఏపీలో మత్స్యకారులకు రూ.109 కోట్లు పంపిణీ.. ఎందుకంటే!

By:  Tupaki Desk   |   13 May 2022 8:30 AM GMT
ఏపీలో మత్స్యకారులకు రూ.109 కోట్లు పంపిణీ.. ఎందుకంటే!
X
``మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టిం చుకోలేదు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించండి. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నాం`` అని సీఎం జగన్‌ అన్నారు. కాకినాడ జిల్లా మురమళ్లలో నిర్వహించిన మత్స్యకారభరోసా బహిరంగ సభలో ఆయ‌న ప్రసంగిస్తూ.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌పై నిప్పులు చెరిగారు.

``గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, గీతగా భావించాం.`` అని వ్యాఖ్యానించారు.

దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. దాదాపు లక్షా తొమ్మిది వేల మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామ‌ని చెప్పారు. దీనిలో భాగంగా వరుసగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున.. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్లు రోజు జమ చేస్తున్నట్టు చెప్పారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామ‌న్నారు.

ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలిగిందని, టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమేన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

కానీ, చంద్ర‌బాబు మాత్రం డ‌బ్బాలు కొట్టుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు బాకాలు ఊదేందుకు ఓ వ‌ర్గం మీడియా ఉంద‌ని అన్నారు. మొత్తానికి ఇటీవ‌ల కాలంలో.. వైసీపీ అధినేత ఎక్క‌డ నోరు విప్పినా... విప‌క్షంపై విరుచుకుప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.