Begin typing your search above and press return to search.

ఇంతకీ టికెట్ తెగిందా... ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 3:30 PM GMT
ఇంతకీ టికెట్ తెగిందా... ?
X
ఏపీలో సినిమా టికెట్ల సమస్యకు మరో వారం పది రోజుల్లో శుభం కార్డు పడుతుంది అని గట్టిగానే చెప్పేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ ఇండస్ట్రీ తరఫున హాజరై ముఖ్యమంత్రి జగన్ తో ముఖాముఖీ భేటీ వేశారు. జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని మీడియా ముఖంగా చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ కోరుకున్నట్లుగానే అంతా జరుగుతుంది అని కూడా ఆయన అంటున్నారు.

మరో వైపు సినీ పరిశ్రమతో గత కొంతకాలంగా ఏపీ సర్కార్ కి మాటల యుద్ధం సాగుతోంది. టికెట్ల సమస్య మీద మొదలుపెడితే చాలా వరకూ వెళ్ళిపోయారు. ఇక వైసీపీ నేతలు కూడా చాలా దూకుడుగా మాట్లాడుతూ వచ్చారు. ఇది ఎంతదాకా వచ్చింది అంటే సినీ వర్గాల మీద వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసేదాకా అని చెప్పాలి.

మొత్తానికి ఈ భేటీ ఫలవంతంగా సాగింది అని మెగాస్టార్ చెప్పారు కాబట్టి సినీ వర్గాలు ఊపిరి పీల్చుకోవచ్చు. తొందరలోనే టికెట్ల విషయంలో టాలీవుడ్ కోరుకున్నట్లుగా జీవో రావచ్చు అనే అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో వైసీపీ సాధించింది ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది. టాలీవుడ్ ని గిల్లి గిచ్చి సాధించింది ఏముంది అని కూడా డౌట్ రావచ్చు.

అయితే ఇక్కడ వైసీపీ టాలీవుడ్ ఎక్కడ ఉందో జనాలకు చూపించింది అని అంటున్నారు. నిజానికి అది జనాలకు ఇప్పటిదాకా తెలియని రహస్యమేమీ కాదు, సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే లోకేట్ అయి ఉంది. కానీ దాని మీద ఎపుడూ చర్చ ఎవరికీ లేదు. టాలీవుడ్ పక్క రాష్ట్రంలో ఉంది అని ఎవరూ ఫీల్ అవలేదు కూడా.

కానీ టికెట్ల సమస్య బయటకు రాగానే వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కానీ చేసిన కామెంట్స్ వాటి మీద జరిగిన డిస్కషన్, టాలీవుడ్ వైపు నుంచి కామెంట్స్ ఇలా అంతా అతి పెద్ద డిబెట్ కి దారి తీశాయి. అదే సమయంలో రెండు వైపులకూ సంబంధం లేని వర్గాలు కూడా దీని మీద చర్చించారు. ఇంతకీ టాలీవుడ్ వల్ల ఏపీకి ఒనగూడినది ఏముంది అన్నది వారి నుంచి వచ్చిన మాటలుగా ఉన్నాయి.

ఇలా సామాన్య జనాలకు తెలియచేశామని వైసీపీ వర్గాలు భావించవచ్చు. సరే అంతవరకూ సక్సెస్ అయ్యామనుకున్నా ఇపుడు తెలంగాణాలో లోకేట్ అయిన టాలీవుడ్ ని షిఫ్ట్ చేయడం ఎటూ సాధ్యం కాదు, ప్రభుత్వానికి కనుక సినిమా రంగం ఏపీలో విస్తరించాలి అన్న ఆలోచన ఉంటే ఆ రంగానికి తాను చేయాల్సినది బాగా చేయాలి.

ఎవరో వచ్చి స్టూడియోలు కడతామంటే భూములు ఇవ్వడం కాకుండా ఏపీలో ఉన్న సినీ కళాకారులకు, యువత కోసం ప్రభుత్వమే సొంతంగా స్టూడియో కట్టి అవకాశాలు ఇస్తే బాగుంటుంది కదా. అదే విధంగా ఏపీలో షూటింగులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించడం ద్వారా చిన్న నిర్మాతలను ఆకట్టుకోవచ్చు కదా. ఇక ఔత్సాహిక కళాకారుల కోసం ఫిల్మ్ ఇన్సిట్యూట్ ని ప్రభుత్వమే ఎందుకు ఏర్పాటు చేయకూడదు అన్న చర్చ కూడా వస్తోంది.

ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ రోజు కాకపోయినా మరో రోజుకైనా ఏపీలో కూడా సినీ పరిశ్రమ విస్తరించే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఏపీకి ఆదాయం రావడంలేదని వేరే విధంగా చర్యలు తీసుకున్నా లేక ఉన్న వాటికి కొత్త సమస్యలు జత చేసినా టోటల్ గా తెలుగు సినిమా పరిశ్రమ ఇబ్బందిలో పడుతుంది కదా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఒక మాట అయితే అంతా అంగీకరిస్తున్నారు.

ప్రభుత్వం పేదవాడిని తక్కువ ధరకు వినోదం అంటూ వైసిపీ వారు చేసుకున్న ప్రచారం అయితే జనాలకు ఎక్కలేదు అని, దాని కంటే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. వాటి మీద దృష్టి ఎందుకు పెట్టలేదు అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో సినిమా టికెట్ల ఇష్యూ ఒక విధంగా సర్కార్ కి బూమరాంగ్ అయిందనే అంటున్నారు. ఇకనైనా ఈ ఇష్యూని తొందరగా పరిష్కరించి బయటపడడమే వైసీపీ పెద్దలు చేయాల్సిన పని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.