Begin typing your search above and press return to search.

ఆంధ్రా తీరానికి ఈడీ...బాబు టీం టార్గెట్ గా..?

By:  Tupaki Desk   |   4 Dec 2022 11:30 AM GMT
ఆంధ్రా తీరానికి ఈడీ...బాబు టీం టార్గెట్ గా..?
X
ఈడీ, సీబీఐ ఐటీ ఇవన్నీ కూడా తెలంగాణాలోనే ఇపుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్కడే కేంద్ర దర్యాప్తు సంస్థలు హాల్ చల్ చేస్తున్నాయి. అధికార టీయారెస్ సర్కార్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంత్రులు కీలక నేతలు సహా అందరి మీద గురి పెడుతున్నాయి. అలాంటి ఈడీ ఇపుడు ఆంధ్రా తీరం వైపు చూస్తోంది. చంద్రబాబు టీం లక్ష్యంగా ఈడీ దూకుడు చేస్తోంది. గత చంద్రబాబు పాలనలో చోటు చేసుకున్న అక్రమాల మీద ఈడీ ఇపుడు విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణం మీద ఫోకస్ పెట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ఏకంగా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

వారంతా సోమవారం ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు అందుకున్న వారంతా 2014 నుంచి 2019 మధ్యన సాగిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కీలకమైన భూమిక పోషించారు అని ఈడీ గుర్తించింది. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణం అని గతంలో వైసీపీ ఆరోపించింది. ఆ తరువాత అది అలా మరుగున పడిపోయింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ విషయం ఎక్కడా వదలలేదని మొత్తం గుట్టు లాగి బాధ్యులకు నోటీసులు జారీ చేసిందని ఇపుడు అర్ధం అవుతోంది.

అసలు ఈ కుంభకోణం ఏమిటి అన్నది చూస్తే కనుక స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ అప్పట్లో కీలకమైన ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 3,350 కోట్ల రూపాయలు ఈ కార్పోరేషన్ లో పెట్టుబడులు పెట్టడానికి అన్న మాట. అయితే ఇందులో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 370 కోట్ల రూపాయలు మొత్తం ఉంటుంది. ఇక్కడే ఈడీ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు కనుగొనడంతో నోటీసులు జారీ చేసింది.

ఈ సంస్థలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో సైతం నిధులు మళ్ళించిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. మరో వైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న 370 కోట్ల రూపాయలకు బిల్లులను తీసుకున్న సిమేన్ సంస్థ జీఎస్టీని సైతం చెల్లించకుండా పోయింది.ఈ విషయాలు అన్నీ చూసిన మీదట ఈడీ రంగంలోకి దిగి ఇద్దరిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేసింది. సిఎ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను

ఈడీ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది. మొత్తానికి ఈడీ తేల్చింది ఏంటి అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో 234 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. ఇక ఈ కేసుకు సంబంధించి గతంలోనే పూణేకు చెందిన కంపెనీ ప్రతినిధులే అక్రమాలు జరిగాయని ఒప్పుకున్నారని అంటున్నారు.

ఇప్పటికి అయిదేళ్ళ క్రితం అంటే 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ యూనిట్, పూణే, డిజైన్‌టెక్‌పై వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను సమర్పించినందుకు కేసు నమోదు చేయడంతో ఈ కేసు మొత్తం అపుడు వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు

ఇక ఈడీ నోటీసులు పంపించిన వారిలో మాజీ చైర్మన్‌ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఉన్నారు. వారితో పాటు ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు. ఇన్‌వెబ్‌ సర్వీస్‌ నుంచి సీమెన్స్‌ తో పాటు డిజైన్‌ టెక్‌ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది.

ఈ మొత్తం వ్యవహారం చూస్తూంటే ముందు ముందు ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బాబు పాలనలో ఎ కేసు. పైగా నాడు ఐటీ మంత్రిగా కొంతకాలం లోకేష్ ఉన్నారు. మరి ఈ కేసు ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్నది రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.