Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు వర్సెస్ ప్రత్యేక హోదా...సెంటిమెంట్ మంట రగులుడే

By:  Tupaki Desk   |   7 Dec 2022 1:30 AM GMT
మూడు రాజధానులు వర్సెస్ ప్రత్యేక హోదా...సెంటిమెంట్ మంట రగులుడే
X
ఏపీలో ప్రాంతాల సెంటిమెంట్ తో మంట రగిల్చి వచ్చే ఎన్నికల్లో చలి కాచుకోవాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు. విపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాలను కేవలం అమరావతి ప్రాతానికే పరిమితం చేసి ఉమ్మడి పది జిల్లాలలో సత్తా చాటాలని వైసీపీ ఆలోచనగా ఉంది. దాని కోసం తొందరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని కూడా చూస్తోంది.

నిజానికి అమరావతి రాజధాని మీద సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. కానీ జనంలో తమ ప్రభుత్వం మీద విశ్వాసం ఉండేలా మూడు రాజధానులను చట్టం చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది. రేపటి రోజున మూడు రాజధానులు అన్నవి న్యాయ సమీక్షకు నిలబడకపోయినా తమ కమిట్మెంట్ ఏంటో చెప్పామని, వికేంద్రీకరణ తమ విధానం అని వైసీపీ చెప్పుకోవడానికి వీలుంటుంది అని భావిస్తోంది.

మూడు రాజధానులను ఇన్నాళ్ళూ కౌంటర్ చేస్తూ వచ్చిన విపక్షాలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అయితే అంతర్గత సర్వేల్లో మాత్రం ఆ జోలికి వెళ్ళవద్దు అని వచ్చినట్లుగా చెబుతున్నారు. ఉప ప్రాంతీయ సెంటిమెంట్ కాబట్టి దాని విషయంలో రియాక్షన్ ఎలా ఉన్నా ఇబ్బందే అని టీడీపీ ఆ సర్వేలను బట్టి ఆలోచిస్తొంది అని అంటున్నారు.

మరి మూడు రాజధానులు అంటూ వైసీపీ దూకుడు చేస్తే టీడీపీ వద్ద ఉన్న అస్త్రం ఏంటి అంటే ఇపుడు దాన్ని కౌంటర్ చేయడానికే ప్రత్యేక హోదాని ముందుకు తెస్తోంది అని అంటున్నారు. ప్రత్యేక హోదా కూడా సెంటిమెంట్ గానే ఉంది ఇది జనంలో ఉన్న భావన. ఏపీని విడగొట్టినపుడు ఇచ్చిన హామీ ఇలా ఏమీ కాకుండా అయిందని అయిదు కోట్ల మంది కూడా ప్రాంతాల తేడా లేకుండా ఆవేదన చెందుతున్నారు. దీన్నే బ్రహ్మాస్త్రంగా వాడుకుని 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇపుడు టీడీపీ కూడా కేంద్రాన్ని ఏమీ అనకుండా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తూ పాతిక సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా అన్నారు, ఏమైంది జగన్ అంటూ జనంలో నుంచే ప్రశ్నించాలని డిసైడ్ అయింది అంటున్నారు. దీని కోసం వాడవాడలా జేఏసీ ఏర్పాటు చేసి మరీ ప్రత్యేక హోదా మలి విడత ఉద్యమాన్ని రగిలిస్తారు అని అంటున్నారు. ప్రత్యేక హోదా అంటే దీని మీద వైసీపీ మాట్లాడడానికి కూడా ఏమీ ఉండబోదు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీ స్ట్రాటజీని గమనించిన వైసీపీ మరోమారు దాన్ని నెత్తిన ఎత్తుకుంటుందా అన్నదే చూడాల్సిన విషయం. లేటెస్ట్ గా ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అయితే ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పుకొచ్చారు. అలాగే పోలవరానికి నిధులు, రెవిన్యూ లోటుకు సంబంధించి 18 వేల కోట్ల రూపాయలు ఇతర హామీలను నెరవేర్చేలా కేంద్రం మీద వత్తిడి తీసుకుని వస్తామని భరత్ అంటున్నారు.

సరే ఎన్నికలకు గడువు దగ్గరపడింది. ఇన్నాళ్ళూ ఆగిన ప్రత్యేక హోదా నినాదం ఇపుడు మోగించినా ఫలితం ఏమి ఉంటుంది అన్న చర్చ కూడా వస్తోంది. అదే టైం లో ప్రైవేట్ బిల్లు పెట్టినా చర్చకు అనుమతించాలి కదా అన్న మాటా ఉంది. మొత్తానికి చూస్తే మూడు రాజధానుల అంశం మరుగున పడేలా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రగిలించాలన్న విపక్షాల ఎత్తుగడలు ఎంతమేరకు ఫలితాయి. సెంటిమెంట్ మంట ఎన్నికల్లో ఏది రగులుతుంది ఎవరికి లాభం కలుగుతుంది అన్నది ముందు ముందు చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.