ఏబీవీకి కౌంటర్ ఇచ్చిన ఏపీ పోలీస్!

Sun Apr 18 2021 19:00:02 GMT+0530 (IST)

AP Police Counter to AB Venkateswara Rao

గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి జగన్ ప్రభుత్వం వచ్చాక ఓ కేసులో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు తాజాగా ఏపీ పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావు తన హయాంలో జరిగిన జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్యపై సీబీఐకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఈ లేఖపై తాజాగా ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది.ఏపీ పోలీసులు లేఖలో ఏబీవీ తీరును ఎండగట్టారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఆధారాలు లేకున్నా.. జగన్ కుటుంబ సభ్యులు బంధువులను అరెస్ట్ చేయాలని ఏబీ ఒత్తిడి చేశారంటూ తీవ్ర అభియోగాలు మోపారు. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి డీజీపీపై ఏబీ నిరాధార ఆరోపణలు చేశారని కౌంటర్ ఇచ్చారు.

నాడు వైఎస్ వివేకా హత్య దర్యాప్తు అంతా ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగిందని.. ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు ప్రతిరోజు మీడియాతో మాట్లాడేవారని ఏపీ పోలీసులు లేఖలో విమర్శించారు. తన వద్దనున్న కీలక సమాచారాన్ని నాడే ఏబీవీ ఎందుకు సిట్ కు ఇవ్వలేదని .. జగన్ కుటుంబ సభ్యులను బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి తెచ్చారా? లేదా అని ప్రశ్నించారు.

నాడుదర్యాప్తు అధికారి రాహుల్ దేవ్ శర్మపై ఏబీవీ ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కాదా? అని ఏపీ పోలీసులు లేకలో ప్రశ్నించారు. రాహుల్ దేవ్ శర్మ నిబద్ధత గల అధికారి కాబట్టి ఒత్తిళ్లకు తలొగ్గలేదని తెలిపారు. వివేకా హత్య కేసు విషయంలో తన వద్దనున్న దర్యాప్తు సమాచారాన్ని ఏబీవీ అందివ్వకపోవడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు టెక్నికల్ డీఐజీ పాల్ రాజు పేరిట ఏపీ పోలీస్ శాఖ లేఖలో కౌంటర్ ఇచ్చింది.