జగన్ ది రివ్యూ మీటింగ్ కాదా... వార్నింగ్ మీటింగ్ నా... ?

Thu Sep 29 2022 23:59:34 GMT+0530 (India Standard Time)

AP People on Jagan Review Meeting

పేరుకు రివ్యూ మీటింగ్. కానీ అక్కడ చూస్తే  వేడి వేడి వార్నింగులే వచ్చాయి. దాంతో బయట జనాలకు అది ఫక్తు  వార్నింగ్ మీటింగా అని డౌట్లు వచ్చేస్తున్నాయట. నిజానికి రివ్యూ మీటింగ్ అంటే  అన్నివిషయాల మీద సమగ్రమైన పూర్తి స్థాయి సమీక్ష ఉంటుంది. తాను చెప్పడమే కాదు అవతల వైపు వినడమూ ఉంటుంది. ప్రతీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం వాటికి తగిన పరిష్కారాలు చూపించడం జరుగుతుంది.కానీ జగన్ గడప గడప ప్రోగ్రాం మీద వరసబెట్టి పెడుతున్న రివ్యూ మీటింగ్ లా లేదు అని అంటున్నారు. కేవలం తాను చెప్పాల్సింది చెబుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి ప్రభుత్వం ఎంత సహాయం చేస్తోంది. ప్రభుత్వం ఎంతవరకూ మద్దతుగా ఉంటోంది ఇలాంటి విషయాలు నిజానికి రివ్యూలో చర్చకు వస్తే నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉంటుంది.

ఇక నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎమ్మెల్యేలు కలుపుకునిపోతున్నారా లేదా అని ఆరా తీయాల్సింది ఈ సమీక్షా సమావేశలోనే. అదే విధంగా ఎమ్మెల్యేలు తాము ఇచ్చిన హామీలను ఎంతవరకూ జనాలకు పరిష్కరించారు జనాలతో వారి అనుసంధానం ఎలా ఉంది అన్నది కూడా చూడాలి. కానీ జగన్ చేస్తున్న రివ్యూలో ఇలాంటి ముచ్చట్లు అయితే ఉండడంలేదు అన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక ఎన్నికలు సీట్లూ అంటూ జగన్ చెప్పడం పని చేసే వారికే టికెట్లు ఇస్తామని ఎన్నికలకు ఆరు నెలల ముందు టికెట్లు ఇస్తామని చెప్పడం వల్ల సమీక్ష కాస్తా పక్కా ఎన్నికల అజెండాతోనే  సాగుతోంది అని అంటున్నారు. పైగా నిరంతరం తమ మీద నిఘా ఉంచడం తాము పనిచేయడం లేదని అది కూడా వైసీపీ హై కమాండ్ తెచ్చి పెట్టిన  ప్రమాణాల మేరకు చేయడం లేదని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తూ నిరాశలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.

ఇక పనిచేయని వారికి టికెట్లు ఇవ్వమని చెప్పడం అంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఉత్సాహాన్ని చంపడమే అని కూడా అంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు ఏం చేయాలి అన్నది కూడా చూడాలి కదా. వారికి నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం నిధులు ఇచ్చి వాటిని ఏ మేరకు ఖర్చు పెట్టారు. జనాలు ఇంకా ఏమి కోరుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏమిటి అన్నది సమీక్షలో అడిగి తెలుసుకుంటే ఫలవంతమైన రిజల్ట్స్ వస్తాయి కదా అంటున్నారు.

కానీ ఎంతసేపూ టికెట్లు ఇవ్వను పని తీరు మార్చుకోండి అంటూ వార్నింగులు ఇవ్వడం వల్ల నేతలు డీ మోరలైజ్ అయి చేసేవారూ కూడా ఇబ్బంది పడతారని చివరికి అది కాస్తా టోటల్ పార్టీకే ఇబ్బందికరంగా మారుతుంది అని అంటున్నారు. మరి దీని మీద అధినాయకత్వం ఎలా ఆలోచిస్తుందో. ఇక మీదట జరిగే రివ్యూస్ అయినా ఆ దిశగా ఉంటాయా లేక యధాప్రకారం వార్నింగులతోనే సరిపెడతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.