Begin typing your search above and press return to search.

తండ్రి ఆస్తుల్ని అమ్మి.. ఏపీ మంత్రి ప్రజాసేవ చేస్తున్నారట

By:  Tupaki Desk   |   25 Sep 2021 4:30 AM GMT
తండ్రి ఆస్తుల్ని అమ్మి.. ఏపీ మంత్రి ప్రజాసేవ చేస్తున్నారట
X
ఏపీ మంత్రుల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న డాక్టర్ పి. అనిల్ కుమార్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాడీ బిల్డింగ్ బాడీ అన్నట్లు ఫిట్ గా ఉండే ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ‘నువ్వు ఒకటి అంటే నేను పది అంటా’ అన్నట్లు వ్యవహరించే అనిల్ కుమార్ మీద తరచూ ఏవో ఒక ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఆరోపణలు కొన్ని వినిపిస్తున్నాయి. ఆయన కొత్తగా కట్టుకుంటున్న ఇల్లు.. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత సంపాదించిన సొమ్ముతోనే అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తాజాగా మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. కొందరు తన గురించి ఏదేదో మాట్లాడుతుంటారని.. కానీ తన తండ్రి సంపాదించిన కోట్లాది రూపాయిలు విలువ చేసే ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్నాయని.. వాటిని అమ్మి మరీ తాను ప్రజాసేవ చేస్తున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు. ఇవాల్టి రోజుల్లో అధికారంలో ఉన్న నేతలు ఎప్పటికప్పుడు తమ ఆస్తుల్ని పెంచుకోవటమే తప్పించి.. ఉన్న ఆస్తుల్ని అమ్మి మరీ ప్రజాసేవ చేయటం ఇటీవల కాలంలో ఎవరూ కనిపించని పరిస్థితి.

తాజాగా చేసిన వ్యాఖ్యలతో అనిల్ కుమార్ ఆ లోటును తీరుస్తున్నారన్న భావనను కలిగించారని చెప్పాలి. ఇందులో నిజం ఎంతన్న విషయం నెల్లూరు జిల్లా వాసులకు తెలియంది కాదు. తన మీద వస్తున్న ఆరోపణలకు బదులిస్తూ.. తాను తన తండ్రి నిర్మించిన ఇంటిని కొన్ని మార్పులు చేశారే తప్పించి కొత్తగా నిర్మించలేదన్నారు. ఇప్పటికి కొంతమేర ఆస్తులు ఉన్నాయన్నారు.

సర్వేపల్లి ఆధునికీకరణ పనులు రూ85 కోట్లతో టెండర్లు పిలిచి చేస్తుంటే.. ఆ పనులు తనవంటూ ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఆరోపణలు మంచి పద్దతి కాదన్న ఆయన రూ.100 కోట్లతో పెన్నా బ్రిడ్జి టెండర్లు పిలుస్తామని.. దమ్ముంటే టెండరు వేసుకోవాలని వ్యాఖ్యానించటం గమనార్హం. ఏమైనా.. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తుల్ని అమ్మి మరీ ప్రజాసేవ చేస్తున్నట్లు చెబుతున్న మంత్రి అనిల్ కుమార్ మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయని చెప్పక తప్పదు. ఇందులో నిజమెంతన్నది వచ్చే ఎన్నికల్లో.. తన ఆస్తుల అఫిడవిట్ దాఖలుతో తెలుస్తుందన్న మాట ఆయన ప్రత్యర్థుల నోట వినిపిస్తుండటం గమనార్హం.