పొద్దుపొద్దున్నే బాలయ్య డైలాగ్ తోనే రోజా ట్వీట్ పంచ్

Sun Sep 25 2022 17:35:26 GMT+0530 (India Standard Time)

AP Minister RK Roja On Balayya

మర్యాదలకు కాలం చెల్లి చాలా కాలమే అయ్యింది. రాజకీయ అధిక్యత కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు అంతకంతకు పెరుగుతోంది. గతంలో ఏదైనా అంశం మీద విమర్శ చేయాలంటే గౌరవ పూర్వకంగా.. సబ్జెక్టు అంశాలే తప్పించి.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లే వారు కాదు. దూకుడు రాజకీయాలు షురూ అయ్యాక.. రాజకీయం రంగు.. రుచి.. వాసన పూర్తిగా మారిపోవటం తెలిసిందే.  ఎవరినైనా ఎంత మాట అయినా అనేయొచ్చు అన్నదిప్పుడు అలవాటుగా మారింది. అంత స్థాయి వ్యక్తిని మాట అనటమా? అన్నది అస్సలు లేదు.  అంతేకాదు.. గతంలో అధినేతలు ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే.. అందులో లోపాలు ఉంటే.. స్పందించే విషయంలో ఆచితూచి అన్నట్లుగా నేతలు పలువురు ఉండేవారు. తమ సిద్ధాంతానికి భిన్నంగా ఉండే వాటి విషయంలో పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడకుండా మౌనంగా ఉండం చేసేవారు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది.

దీనికి తోడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో.. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో.. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.. తాము చెప్పాలనుకున్న విషయాన్ని క్షణాల్లో తాను అనుకున్న వారికి చేరేలా సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వటం.. రాజకీయ నేతలకు మరింత లాభించింది. తాజా ఎపిసోడ్ ను తీసుకుంటే.. ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున.. మరింత స్పష్టంగా చెప్పాలంటే తెల్లవారటానికి దాదాపు గంటకు పైనే అంటే.. ఉదయం 4.45 గంటల వేళ ఏపీ మంత్రి ఆర్కే రోజా ఒక ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీ నుంచి తొలగించి.. దాని స్థానే వైఎస్సార్ పేరునను పెట్టిన వైనంపై ప్రముఖ సినీ నటుడు కమ్ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ స్పందిస్తూ జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై విమర్శలు చేయటం షురూ చేశారు. ఇంతకాలం ఆయన్ను టార్గెట్ చేసిన దానికి భిన్నంగా.. ఆయన వ్యక్తిగత అంశాల్నిప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు.

దీనికి కొనసాగింపుగా కాస్త ఆలస్యంగా రియాక్టు అయ్యారు మంత్రి ఆర్కే రోజా. మిగిలిన వారికి కాస్త భిన్నంగా.. బాలయ్య సినిమా డైలాగ్ ను ఆయనకే పంచ్ ఇచ్చేలా మారుస్తూ తన టాలెంట్ ను ప్రదర్శించారు. 'బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ అన్న ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ''గన్'' అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే' అంటూ పేర్కొన్నారు. తమ అధినాయకుడ్ని సినిమాటిక్ హైప్ క్రియేట్ చేస్తూ.. తాను టార్గెట్ చేసిన బాలయ్యను చిన్నబుచ్చేలా.. ఆయన సినిమా డైలాగ్ ను ఆయనకే అప్పజెప్పిన రోజా తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ పెంచేలా మారిన రోజా ట్వీట్ కు బాలయ్య ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.