విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Fri Oct 07 2022 19:12:45 GMT+0530 (India Standard Time)

AP Minister Dharmana Prasada Rao hot comments

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి తర్జన భర్జనలకు చోటు లేదని చెప్పారు. అంతేకాదు.. వ్యక్తిగతంగా తాను మూడు రాజధానులకే మద్దతి స్తానని చెప్పారు. విశాఖను రాజధాని చేయడం కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.‘‘విశాఖ రాజధాని కోసం ఉద్యమం అవసరం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తాం. అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదు. ఈ గడ్డ మీదికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం. దశాబ్దాల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుబడితో అమరావతి  రైతులు  పాదయాత్ర చేస్తున్నారు. సిక్కోలు జిల్లా వాసులు విశాఖ రాజధాని కోసం గట్టిగా నినదించాలి.’’ అని విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు..ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అందరూ కూడా మూడు రాజధానులకే ముఖ్యంగా విశాఖను రాజధాని చేయడం కోసమే కట్టుబడి ఉన్నారని.. ధర్మాన తెలిపారు. విశాఖ రాజధాని అయితేనే.. ఉత్తరాంధ్ర ప్రజల తలరాతలు మారతాయని చెప్పారు.

ఈ విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారని.. లేనిదల్లా ప్రతిపక్షాలేనని చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం.. ప్రాంతాల అభివృద్ధి కోసమే.. మూడు రాజధానుల అజెండాను ఎంచుకున్నారని.. ఆయన వెల్లడించారు. అంతేకాదు.. దీనిని సాకారం చేసేందుకు.. సీఎం జగన్ ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మొత్తానికి ధర్మాన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.