Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా నుంచి బిగ్ సౌండ్ : బొత్స ఆంతర్యం ఏంటి...?

By:  Tupaki Desk   |   26 Sep 2022 12:30 AM GMT
ఉత్తరాంధ్రా నుంచి బిగ్ సౌండ్ : బొత్స ఆంతర్యం ఏంటి...?
X
మూడు ముక్కలాటకు వైసీపీ రెండున్నరేళ్ల క్రితం తెరతీసింది. అయితే అదంత సులువు కాదని ఇప్పటికే అర్ధమైపోయింది. అయితే ప్రాంతాలు, మతం, కులం ఇవ్వన్నీ చాలా సున్నితమైన అంశాలు, వీటితో చెలగాట ఆడాలనుకుంటే నిప్పుతో ఆటలు ఆడుకున్నట్లే. ప్రాంతాల మధ్య విభేధాలు తీసుకురావడం ఈజీ. కానీ వాటిని  కలపడం చాలా  కష్టం.

మంచో చెడ్డో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన ఎత్తుకుంది. ఇది సాకారం అవుతుందా కాదా అన్నది సుప్రీం కోర్టులో ఉన్న కేసు ఏమవుతుంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఈ లోగా భావోద్వేగాలను మెల్లగా రాజేస్తున్నారు. రేపటి రోజున ఏ కారణం చేత అయినా రాజధాని విశాఖకు రాకపోయినా లేక మరే ఇతర కారణాల వల్ల ఆగినా కూడా ఉత్తరాంధ్రా ఆకాంక్ష సైలెంట్ గా అలాగే  ఉంటుందా. ఇది బిగ్ క్వశ్చన్.

ఇప్పటికే ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. ఇపుడు ఏపీలో మూడు ప్రాంతాలు మూడు భిన్న స్వరాలు వినిపిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా మరోరకమైన  సీరియస్ డిస్కషన్.  ఇదిలా ఉంటే ప్రాంతాలు, మతం, కులం అన్నవి పాలిటిక్స్ లో ట్రంప్ కార్డుగా వాడుకుంటారు. ఆ తరువాత లైట్ తీసుకుంటారు. అపుడే అసలు సమస్య మొదలవుతుంది.

వైసీపీ మూడు రాజధానుల ఇష్యూ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. మూడింట రెండు ప్రాంతాల దన్ను ఉంటే రేపటి ఎన్నికల్లో మరోసారి అధికారం తమదే అని లెక్కలేసుకుంటోంది. అందుకే ఎన్నికల దాకా ఈ ఇష్యూని సాగదీయాలనే సుప్రీం కోర్టుకు వెళ్ళింది అని ప్రచారంలో ఉన్న మాట.  ఆ లెక్కలు చూస్తే మళ్ళీ వైసీపీ పవర్ లోకి వస్తే రాజధాని ఇష్యూ అన్నది కోర్టు తీర్పు మేరకే అని చెప్పవచ్చు.

కానీ  ఇపుడిపుడే ఉత్తరాంధ్రా రాజధాని మీద సీరియస్ గా చర్చ సాగుతోంది. విశాఖ రాజధాని కావాలని జనాల వద్దకు వెళ్ళి వైసీపీ వారు చెబుతున్నారు. ఇంకో వైపు సడెన్ గా వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చి చాలా మాట్లాడారు. అందులో కొన్ని సంచలన కామెంట్స్ కూడా ఉన్నాయి. విశాఖ రాజధాని అవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఉత్తరాంధ్రా ప్రాంతీయుడిగా ఈ విషయం మీద మాట్లాడుతున్నాను అని బొత్స చెప్పడం విశేషం. ఇపుడు నోరు విప్పకపోతే తీరని అన్యాయం ఈ ప్రాంతానికి జరుగుతుందని ఆయన అంటున్నారు. విశాఖ కోసం మంత్రి పదవిలో ఉన్నా తాను మాట్లాడక తప్పదని ఆయనే చెప్పుకున్నారు. తాను ఇరవై ఆరు జిల్లాల మంత్రిని అయినా ఉత్తరాంధ్రా అంటే మక్కువ ఎక్కువ అని బోల్డ్ గా చెప్పేశారు.

దానికి కారణం తాను పుట్టిన ప్రాంతం కావడమే అన్నారు. ఒక విధంగా బొత్స ఉత్తరాంధ్రా సెంటిమెంట్ తో మాట్లాడారు. తాను కేవలం ఉత్తరాంధ్రా సమస్యలనే ప్రస్థావించడం లేదని, అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆయన అంటూనే తన సొంత గడ్డ కోసం పాటు పడతాను అంటున్నారు.

ఈ కామెంట్స్ బట్టి చూస్తే రేపటి రోజున కోర్టు తీర్పు ఎలా వచ్చినా కూడా  బొత్స భవిష్యత్తులో ఉత్తరాంధ్రా కోసం ఏమైనా ఉద్యమం చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. మూడు రాజధానులలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటు ఏ కారణం చేత అయినా ఆగితే మాత్రం బొత్స లాంటి వారికి రాజకీయ సరుకు దొరికినట్లేనా అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఏది ఏమైనా ప్రాంతాల మధ్య విభజన అన్నది చేయడం సులువు కానీ ఆ మంటను ఆర్పడం  కష్టం. ఇపుడు విశాఖ రాజధాని కోసం సీనియర్ మంత్రి ఫీల్డ్ లోకి దిగారు. రేపటి రోజున వేడి రాజుకుంటే ఆయన మరేం చేస్తారో ఏ రకంగా లీడ్ తీసుకుంటారో చూడాల్సిందే.