ఏపీ హోం మంత్రి ఫైర్.. కోనసీమ అగ్గి వెనుక వారేనట

Wed May 25 2022 08:59:10 GMT+0530 (IST)

AP Home Minister Fire

ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా.. గొడవలకు.. ఆందోళనలకు కాస్తంత దూరంగా ఉండే ‘కోనసీమ’.. తాజాగా మండుతోంది. ఈ మధ్యనే ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు ముందు పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయన్న కారణంగా జగన్ ప్రభుత్వం.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరును పెట్టటం తెలిసిందే.దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చొద్దని అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారటమే కాదు.. ఏపీలో ఇంతకు ముందెప్పుడూ చోటు చేసుకోని సీన్లు చోటు చేసుకున్నాయి.

ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమ వేళలోనూ.. నాటి రాష్ట్ర మంత్రులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను దగ్థం చేసింది లేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.

మంత్రి విశ్వరూప్ తో పాటు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటిని ఆందోళనకారులు నిప్పు అంటించటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఉదంతంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరికి స్ఫూర్తిదాత అని.. అలాంటి మహానుభావుడి పేరును ఒక జిల్లాకు పెడితే.. దాన్ని వ్యతిరేకించటం బాధాకరమన్నారు.

కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకు అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న గొడవలు.. ఆందోళనల వెనుక టీడీపీ.. జనసేన పార్టీలు ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతుందంటూ మండిపడ్డారు.

ఒకవేళ తానేటి వనిత పేర్కొన్నట్లుగా అమలాపురం ఆందోళన వెనుక ఆ పార్టీ ఉండి ఉంటే.. అందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతటి తీవ్ర పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.