ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. ప్రభుత్వానికి ఇచ్చిన భూమి తిరిగి తీసుకోలేరు

Wed May 25 2022 08:59:59 GMT+0530 (IST)

AP HighCourt Verdict on Land Dispute

కీలక తీర్పును ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఏదైనా అవసరం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని.. సదరు పని కోసం సర్కారు వినియోగించకుండా ఉన్నప్పటికీ ఆ భూమిని మాత్రం తిరిగి తమకు ఇవ్వమని అడగలేరని స్పష్టం చేసింది.ఒకసారి భూసేకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పరిహారం అందుకున్న తర్వాత.. ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లిన భూమిని సదరు భూ యజమాని దానిని వెనక్కి ఇవ్వమని అడగలేరని తేల్చి చెప్పారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి.

అసలీ వివాదం ఎందుకు వచ్చిందంటే.. బలహీన వర్గాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కర్నూలు జిల్లాలోని మిడ్తూరు మండలం దేవనూరులో 2.57 ఎకరాల భూమిని దాని యజమాని సుంకిరెడ్డి నుంచి ప్రభుత్వం తీసుకుంది.

అయితే.. ఆ భూమిని ఖాళీగా ఉంచిన ప్రభుత్వం.. ఎవరికి దాన్ని కేటాయించలేదు. దీంతో.. 2015లో సుంకిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తన భూమి తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు.

దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి.. పరిహారం ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించటం లేదన్న కారణంగా పిటిషనర్ కు భూమిని తిరిగి ఇవ్వమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. అది సాధ్యం కాదని చెప్పింది.