Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   3 Dec 2021 3:30 PM GMT
జగన్ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన హైకోర్టు
X
వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అలా అని.. ఇష్టం వచ్చినట్లుగా తీసుకునే నిర్ణయాలతో లేనిపోని తలనొప్పులు రావటం ఖాయం. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. వేగంగా వాహనం నడపటమంటే.. తనకు అడ్డు వచ్చిన వాహనాల్ని తెలివిగా దాటుకుంటూ వెళ్లాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా ఢీ కొట్టుకుంటూ వెళితే ఏం జరుగుతుంది? ఏపీలోని జగన్ సర్కారు తీరు కూడా ఇప్పుడు ఇలానే ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావటం.. కోర్టుల్ని ఆశ్రయించటం.. అక్కడ ఎదురుదెబ్బలు తగలటం ఎక్కువైంది.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు షాకిచ్చింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషణ్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అంతేకాదు.. ఈ కోటాలో సీట్లను భర్తీని కన్వీనర్ చూస్తారంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది.

యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ.. ఓబీసీలకు జగనన్న విద్యా దీవెన వర్తించాలని కూడా కోర్టు పేర్కొంది. కోటా భర్తీపై ప్రభుత్వం చేసిన నిబంధనలు సరిగా లేవని పేర్కొంది. యాజమాన్య కోటా సీట్ల భర్తీని కన్వీనర్ పర్యవేక్షిస్తారంటూ ఏపీ ప్రభుత్వం చెప్పటంతో.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే కన్నా. .ఆచితూచి అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.