ఏపీ సర్కారుకు హైకోర్టు ధర్మాసనం షాక్!

Sat Mar 06 2021 08:51:21 GMT+0530 (IST)

AP High Court Gave Huge Shock To Ap Govt

ఏపీ హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును ఇచ్చింది. ఏపీ సర్కారు ఇరుకున పడేలా ఉన్న ఈ తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రస్తుతం పురపాలక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు వలంటీర్లు తమకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను అధికారులకు అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ విధుల్లో భాగంగా ఫోన్లు అవసరమైతే సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ఎన్నిక సంఘం ఇచ్చింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు కారణం.. వార్డు వలంటీర్లపై పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలే. ఎన్నికల సంఘం ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఏక సభ్య ధర్మాసనం.. వార్డు వలంటీర్లు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను వెనక్కిఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా  శుక్రవారం సాయంత్రం అప్పీలుకు వెళ్లింది. న్యాయమూర్తులు ఇంటి నుంచే రాత్రిపూట విచారణ జరిపారు.

ఈ కేసుకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున  సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తమ వాదనల్ని వినిపించారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామ వలంటీర్లు.. అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లుగా కంప్లైంట్లు వచ్చాయని.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫోన్లలో సంక్షేమ పథకాల లబ్థిదారుల డేటా మొత్తం ఉందని పేర్కొన్నారు. వాటిని ఉపయోగించుకొని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపించారు.

ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్వహించే క్రమంలో మొబైల్ ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వాటిని అప్పగించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పరస్పర అంగీకారం మేరకు ఫోన్లు ఏ అధికారి వద్ద పెడితే మంచిదో రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదిని.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరంను కోరారు. ఇరు వర్గాల అభిప్రాయాలు విన్న తర్వాత.. మున్సిపల్ కమిషనర్లు నిర్ణయించిన అధికారుల వద్ద వలంటీర్ల ఫోన్లు ఉంచాలని ధర్మాసనం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే వార్డు వలంటీర్లు ప్రభుత్వం తమకు ఇచ్చిన మొబైల్ ఫోన్లను వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది.