Begin typing your search above and press return to search.

అమరావతి బంగారు బాతు గుడ్డు : బాబు అనుకుంటే జగన్ చేస్తున్నారు...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 2:05 PM GMT
అమరావతి బంగారు బాతు గుడ్డు : బాబు అనుకుంటే జగన్ చేస్తున్నారు...?
X
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచనలు చాలా పీక్స్ లో ఉండేవి. నిజంగా ఆయన ఆలోచనలు అమలుకు నోచుకుని ఉంటే ఈ పాటికి అక్కడ ఒక అద్భుతమే ఆవిష్కృతం అయ్యేదా అన్న చర్చ కూడా ఉంది. అయితే బాబు మూడేళ్ళ పాటు ఆలోచనల్లో గడిపి చివరి రెండేళ్ళు అమలుకు ప్రయత్నం చేశారు. ఈ లోగా పుణ్యకాలం అయిపోయింది. 2019 ఎన్నికల వేళ మరో మారు టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి అమరావతికి ఒక రూపూ షేపూ వచ్చేవి.

కానీ బాబు పవర్ లోకి రాలేదు. జగన్ రాగానే అమరావతి మీద శీత కన్ను వేశారు. మూడు రాజధానులు అని కొత్త కాన్సెప్ట్ ని తెర మీదకు తెచ్చారు. చివరికి హై కోర్టు తీర్పుతో అమరావతి రాజధాని అని డిసైడ్ అయినట్లుగా ఉంది. అమరావతిని అభివృద్ధి చేయమని హై కోర్టు ఆదేశం ఉంది. దాన్ని ఎలా చేయాలన్నది ఆలోచిస్తూంటే ప్రభుత్వానికి తట్టిన ఆలోచన భూములు అమ్మకం.

నాటి చంద్రబాబు సర్కార్ రాజధాని ప్రాంత అభివ్రుద్ధి అథారిటీ సీఆర్డీఏ రాజధాని కోసం సేకరించిన భూములే ఇపుడు అతి పెద్ద ఆర్ధిక దిక్కుగా మారడం అంటే విశేషమే. ఏకంగా ఆరు వందల ఎకరాలను బాబు సర్కార్ ఇతర కార్యక్రమాలకు అట్టేబెట్టింది. ఆ వందల ఎకరాలను విడతల వారీగా అమ్మకానికి సీఆర్డీఏకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రానున్న కాలంలో ఇలా అమ్మగా వచ్చిన ఆదాయంతో అమరావతిని డెవలప్ చేస్తారు అన్న మాట.

ఇక ఎకరం పది కోట్లుగా పెట్టి తొందరలో 248 ఎకరాలను వేలం వేయబోతున్నారు. అంటే దీని ద్వారా 2,480 కోట్ల రూపాయలను ఆశిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే టీడీపీకి వైసీపీ దొరికేసింది అంటున్నారు. నాడు అమరావతి రాజధానిని శ్మశానం అన్నారు, ఇపుడు అక్కడ ఒక ఎకరం పది కోట్లు అంటే బాబు చేసిన డెవలప్మెంట్ ఏంటి అన్నది తెలుస్తోంది కదా అని తమ్ముళ్ళు అంటున్నారు.

ఇక చంద్రబాబు ఆ మధ్యదాకా తరచూ ఒక మాట చెబుతూ వచ్చేవారు. అమరావతి అభివృద్ధికి అక్కడ భూములను ఉపయోగించుకోవచ్చు అని. సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ గా అమరావతి ప్రాజెక్ట్ ని తాను టేకప్ చేసాను అని. లక్ష కోట్లు ఉండాలి మా దగ్గర లేవు అని వైసీపీ అన్నప్పుడల్లా బాబు ఇలాగే జవాబు ఇచ్చేవారు. ఇపుడు చూస్తే భూముల అమ్మకంతో అమరావతిని డెవలప్మెంట్ చేయాలన్న బాబు ఆలోచనను జగన్ అంగీకరించి అమలు చేస్తున్నారు అనుకోవచ్చా అంటే జవాబు అవును అనే వస్తోంది. మొత్తానికి అమరావతి భూములే అక్కరకు రావడం వైసీపీకి ఎలా ఉందో కానీ బాబు విజన్ ని మాత్రం తెలియచేస్తోంది అంటున్నారు.

మూడేళ్ళుగా అమరావతి రాజధాని మీద వైసీపీ సర్కార్ ఏ రకమైన రచ్చ చేయకుండా ఉంటే ఇపుడు ఎకరం పది కోట్లు కాదు ఇరవై కోట్లు అన్నా మంచి రేటు వచ్చేదని అన్న వారూ ఉన్నారు. మొత్తానికి వైసీపీ తొందరపాటు చర్యల వల్ల అమరావతిలో రియల్ బూమ్ తగ్గింది. ఇపుడు ఎంతో కొంత అభివృద్ధి చేస్తేనే మళ్ళీ దారిన పడుతుంది అంటున్నారు. ఇంతకీ అమరావతి రాజధానిగా డెవలప్మెంట్ చేయడానికి జగన్ కి ఇష్టం ఉందా. చూడాలి మరి.