Begin typing your search above and press return to search.

వ‌రి విష‌యంలో ఏపీకి ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి...!

By:  Tupaki Desk   |   28 Nov 2021 10:57 AM GMT
వ‌రి విష‌యంలో ఏపీకి ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి...!
X
ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇటీవల చిన్న చిన్న విషయాల్లో కూడా అగాధం పెరుగుతున్న పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మధ్య అగాథం ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మాత్రం రెండు ప్రభుత్వాలు ఒక్కోసారి ఒకే ధోరణితో ముందుకు వెళుతున్నాయి. వ‌రి పంట విష‌యంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ‌రి వేయ‌వద్దని తీర్మానం చేయడంతో పాటు ఆ నివేదిక అన్ని రాష్ట్రాలకు పంపించింది. అయితే దేశంలొ వరి పంట పండించే రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్న ఏపీ - తెలంగాణ - కేరళ మాత్రం కేంద్రం ఇచ్చిన సూచనలు పక్కన పెట్టి రైతులపై ఈ విషయంలో ఒత్తిడి పెట్టలేదు.

ఈ క్రమంలోనే వ‌రి సీజన్ ప్రారంభం అవుతుండ‌డంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారికంగా వరి పంట వేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. కొందరు కలెక్టర్లు రైతులను వ‌రి వేయ‌వ‌ద్ద‌ని నేరుగా హెచ్చరిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఏకంగా డీలర్లకే వార్నింగ్‌లు ఇస్తున్నారు.

రైతులకు ధాన్యం విత్తనాలు అమ్మితే డీలర్‌షిప్ రద్దు చేస్తామని క‌లెక్ట‌ర్లు చెబుతున్నారు. పోనీ రైతుల‌ను ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేసేందుకు ప్రోత్స‌హిస్తున్నారా ? అంటే అదీ లేదు. దీంతో రైతుల బాధ‌లు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరకు సీఎం కేసీఆర్ సైతం రంగంలోకి దిగి ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణలో వ‌రి పంట‌ కంట్రోల్ చేసే విషయం ప్రభుత్వానికి ఎంత త‌ల‌నొప్పిగా మారిందో తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే ఇదే సమస్య ఏపీలో కూడా ఉంది.

ఆ మాటకొస్తే దేశంలోనే ఎక్కువ వ‌రి దిగుబడి... ఏపీలోని గోదావరి జిల్లాల‌లోనే లభిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం నేరుగా కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి పోరాటం చేయడం లేదు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి. మరోవైపు అప్పుల విషయంలో కూడా కేంద్రం చాలా కండిషన్లు పెడుతుంది. పోలవరం నిధులు... రాజధాని నిధులు అంటూ కోట్ల రూపాయ‌ల‌ నిధులు కోసం కేంద్రం వైపు ఆశగా చూడటం తప్ప ఏం చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ విషయంలో కేంద్రంతో ఫైట్ చేయడం కంటే కేంద్రంతో క‌లిసి ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

మ‌రోసారి ఈ సారి వ‌రి వేయ‌వ‌ద్ద‌ని వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు చెప్పేశారు. దీనినే ప్ర‌తిప‌క్షాలు అస్త్రంగా చేసుకుని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని చూస్తున్నాయి. మ‌రోవైపు ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విష‌యంలో పోరాటం చేస్తుంటే ఏపీ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో ప్ర‌భుత్వానికి అటు కేంద్రంపై పోరాటం చేయ‌లేక‌... ఇటు సైలెంట్‌గా ఉండ‌లేక ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి చందంగా మారింది.