ఇంగ్లీష్ మీడియంకు జీవో..తెలుగుకు తిలోదకాలు ఇచ్చేశారు!

Wed Nov 20 2019 19:03:23 GMT+0530 (IST)

AP Govt Issues GO On English Medium in Govt Schools

రాజకీయంగా అన్ని వైపుల నుంచి వస్తున్న వ్యతిరేకతలను కాదని ఏపీ ప్రభుత్వం తాను అనుకున్నదే అమలు చేయడానికి నిర్ణయించింది.  వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో నూతన విద్యావిధానం అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌తో పాటు ప్రైవేట్ స్కూల్స్‌కి ఈ జీవో వర్తిస్తుంది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇంగ్లీష్‌లో బోధించేందుకు ఉపాధ్యాయులకు గైడెన్స్ ఇవ్వాలని - నూతన సిలబస్ ను సిద్ధం చేయాలని NCERT ని ఆదేశించింది ప్రభుత్వం. దీంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటుకు ఓ కమిషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నివేదిక అందించాలని కోరింది. దీని ప్రకారం విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వ - ఎంపీపీ స్కూళ్లు - జిల్లా పరిషత్  స్కూళ్లను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మారుస్తూ.. అదే సమయంలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠాలను ఇంగ్లీషులోనే బోధించాలనే ప్రతిపాదించారు. అది కూడా 2020-21నుంచే అమల్లోకి రావాలంటూ నివేదిక ఇచ్చారు. మరోవైపు 9వ తరగతి 10వ తరగతి లకు ఇంగ్లీష్ మీడియంను 2021-2022 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని సూచించింది.

మీడియం ఇంగ్లిష్ అయినప్పటికీ తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టులను తప్పనిసరి చేసేలా విద్యాశాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొంది. ఇక ఇంగ్లీషు మీడియం స్కూళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించింది ప్రభుత్వం. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో బోధించగల ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలో రిక్రూట్ చేసే బాధ్యతను కమిషనర్ తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరింది. టీచర్లకు హ్యాండ్ బుక్ లు - ఇంగ్లీషు మీడియంలో బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వడం - వారిలో నైపుణ్యతను పెంచడం వంటి బాధ్యతను SCERT తీసుకోవాలని సూచించింది.