Begin typing your search above and press return to search.

వైసీపీ సర్కార్ షేక్ అయ్యేలా జీవోలిచ్చేస్తున్నారు.....?

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:36 PM GMT
వైసీపీ సర్కార్ షేక్ అయ్యేలా జీవోలిచ్చేస్తున్నారు.....?
X
జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉత్తర్వు అది. ప్రభుత్వం అంటే సర్వసత్తాక వ్యవస్థ. అలాంటి ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదల అయిందంటే దిగువ స్థాయికి చేరేసరికీ చూసేసరికి రోజులు నెలలూ పట్టేది. కానీ ఇపుడు సాంకేతిక యుగం. సోషల్ మీడియా యుగం. ఇలా జీవో జారీ అయితే అలా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతోంది. అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్నాయి.

అంతవరకూ బాగానే ఉన్నా ఇపుడు అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. అక్కడ వచ్చిందే సత్యమని నమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో ఇది ఆసరాగా తీసుకుని ఫేక్ జీవోలు కూడా వెల్లువలా వచ్చేస్తున్నాయి. ఇల ప్రభుత్వ పాలసీల మీద కూడా జీవోలు నిర్ణయాలు సోషల్ మీడియాలో వచ్చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి.

ఆ మధ్యన ప్రభుత్వం పధకాలు కట్ చేస్తుంది అంటూ మ్యాటర్ వచ్చింది. అలాగే దానికి సంబంధించి జీవో అంటూ ఫేక్ జీవోను పెట్టి హడావుడి చేశారు. ఆ తరువాత అలాంటిదేమీలేదని ఇది ఫేక్ అని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇపుడు అలాంటిదే మరో సున్నితమైన అంశం మీద ఫేక్ జీవోను సోషల్ మీడియాలో పెట్టి కొందరు చేసిన హడావుడితో ఏపీ మొత్తం షేక్ అవుతోంది.

ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీవో. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రతీ దాని విషయంలో పర్టిక్యులర్ గా ఉంటారు. అలాటిది ఈ వీకెండ్ వారిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఒక జీవో అయితే ఆయా వర్గాలలో కలవరం కలకలం రేపింది. ఇంతకీ ఆ జీవోలో ఏముంది అంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై అయిదేళ్లకు పెంచుతున్నట్లుగా.

నిజానికి గత ఏడాదే ప్రభుత్వం 60 నుంచి అరవై రెండేళ్ళకు ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచింది. అపుడు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి ఆనందం వ్యక్తం అయితే నిరుద్యోగుల నుంచి నిరసన స్వరం వినిపించింది. మా జాబ్స్ సంగతేంటి అని వారు నిలదీశారు. ఆ తలనొప్పి అలా ఉండగానే ఇపుడు మరో మూడేళ్ళు అంటే 65 ఏళ్ళకు పదవీ విరమణ వయసు పెంచారంటే ఇది నిజమా అని ఉద్యోగులు తర్జన భర్జన పడుతూంటే ఇక మాకు జాబ్స్ ఇంతేనా నిరుద్యోగులు కన్నెర్ర చేస్తున్నారు.

ఇక ఈ రోజంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి ఏది నిజం ఏది నకిలీ అన్నది తేలకుండా సాగిన ఈ జీవో చివరికి ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ ఆర్ధిక శాఖ దీని మీద వివరణ ఇస్తూ ఇది నకిలీ జీవో అని ఎవరో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొంది. దీని మీద గుంటూరు పోలీసులకు ఆర్ధిక శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు. ఎవరు దీని వెనక ఉన్నారో బాధ్యులో చర్యలు తీసుకోవాలని కోరారు.

తమాషా ఏంటి అంటే ఈ జీవో అచ్చం ప్రభుత్వం జారీ చేసినట్లుగా ఉండడం. గత ఏడాది 62 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన జీవోను మక్కీకి మక్కీ దించేసి పక్కన 65 ఏళ్ళు అని రాసి ఫేక్ జీవోని విడుదల చేశారన్న మాట. దీని మీద ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. వెనక ఎవరున్నారు అన్న దాని మీదనే ఇపుడు పోలీసులు విచారణ చేయాలని ప్రభుత్వ పెద్దలు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫేక్ జీవోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ సమాచారం అంటూ వార్తలు వండి వారుస్తున్నారు. మరి దీని మీద ఇంతదాకా ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లనే పదే పదే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఎపుడో ఒకసారి అలా చిల్లరగా అకతాయిగా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ఇలా సర్కార్ ని టార్గెట్ చేస్తూ ఫేక్ జీవోలు వైరల్ చేస్తున్నారు అంటే సర్కార్ పెద్దలు ఇప్పటిదాకా పెద్దగా పట్టనట్లుగా ఉండడమే కారణం అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.