Begin typing your search above and press return to search.

ఆరోగ్య‌శ్రీలోకి మ‌రికొన్ని వ్యాధులు.. కొత్త‌గా చేర్చిన‌వి ఇవే...

By:  Tupaki Desk   |   16 July 2020 4:30 PM GMT
ఆరోగ్య‌శ్రీలోకి మ‌రికొన్ని వ్యాధులు.. కొత్త‌గా చేర్చిన‌వి ఇవే...
X
ఆరోగ్యశ్రీ ప‌థ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పూర్వ వైభ‌వం క‌ల్పిస్తోంది. ఆ ప‌థకానికి భారీగా నిధులు స‌మ‌కూరుస్తూనే పెద్ద సంఖ్య‌లో సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాన‌స‌పుత్రిక‌గా ఉన్న ఈ ప‌థకానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ఇప్ప‌టికే ఈ ప‌థకానికి పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల మ‌హ‌మ్మారి వైర‌స్‌కు చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తేవ‌డం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఇప్పటికే వెయ్యి చికిత్సా విధానాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు తీసుకువ‌స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి విడుద‌ల చేశారు. రూ. వెయ్యి నుంచి రూ.47 వేల వరకు ఖర్చయ్యే 87 చికిత్సా విధానాలను కొత్తగా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చినట్లు ప్ర‌క‌టించారు. ఇన్ పేషెంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు, 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఈ విధానంలో ఉన్నాయి.

వైద్య ఖ‌ర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వ‌చ్చా‌క జగన్‌మోహన్‌రెడ్డి ఆ మేర‌కు హామీ నిల‌బెట్టుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి పైలట్‌ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ఇది ఇప్పుడు విజయనగరం, విశాఖప‌ట్ట‌ణం, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ క‌డ‌ప‌, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్ర‌భుత్వం గురువారం నిర్ణ‌యం తీసుకుంది.