Begin typing your search above and press return to search.

కాగ్ కరెక్టా.. సీఎస్ రైటా... ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 12:30 AM GMT
కాగ్ కరెక్టా.. సీఎస్ రైటా... ?
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ జనాలకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఏది సత్యం, ఏది అసత్యమో వారికి అసలు తెలియడం లేదట. ఇంతకీ ఆ డౌట్ ఏంటి అంటే తాజాగా అందరికీ తెలిసిన విషయమే. ప్రచారంలో ఉన్న విషయమే. కొద్ది రోజుల క్రిందట కాగ్ నివేదికలో ఏపీలో రాబడి బాగా పెరిగింది అని వెల్లడించిందని చెప్పుకున్నారు.

ఆ నివేదిక సారాశం బట్టి చూస్తే గత అయిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఆదాయం పెద్ద ఎత్తున పెరిగింది అని ఉంది. 2021-22లో చూస్తే 88 618 వేల కోట్లుగా రాబడి నమోదైందని పేర్కొంది. అంతే కాదు, వృద్ధి రేటు కూడా ఈ రెండేళ్లలో రాష్ట్ర ఆర్ధిక వృద్ధి 39 శాతానికి చేరింది. అంటే రెండేళ్లకు నమోదు కావాల్సిన 30 శాతం వృద్ధి కంటే 9 శాతం అధిక వృద్ధి నమోదైంది అని కాగ్ నివేదికలో చెప్పినట్లుగా ప్రచారం అయితే జరిగింది.

ఇపుడు తాపీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మాట్లాడుతూ కరోనా వల్ల ఏపీకి ఆదాయం బాగా తగ్గిందని చెప్పారు. 98 వేల కోట్ల రూపాయలు రావాల్సిన చోట బొత్తిగా 62 వేల కోట్ల రూపాయలే ఖజానాకు వస్తున్నాయి కూడా ఆయన చెప్పారు. అందువల్లనే పీయార్సీ విషయంలో తాము చేయాల్సింది చేసినట్లుగా వివరించారు.

సరిగ్గా ఈ పాయింటే ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు పట్టుకున్నారు. ఇంతకీ కాగ్ నివేదిక కరెక్టా సీఎస్ చెప్పింది రైటా అని వారు అడుగుతున్నారు. కాగ్ నివేదిక తప్పుడుది అయితే రాష్ట్ర ప్రభుత్వ కాగ్ కి నోటీసులు ఇవ్వాలని, లేకపోతే సీఎస్ తప్పుగా ఆదాయం తగ్గిందని చెబితే ఆయన విషయంలో ఏం చేయాలో ప్రభుత్వం చూడాలంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

ఒక విధంగా చూస్తే ఇది సహేతుకమైన డిమాండే అనుకోవాలి. రాబడి బాగా పెరిగింది అని ఒక వైపు చెప్పుకుని మరో వైపు ఆదాయాలు లేవు అంటే ఏది నిజం అన్నది ప్రజలకు కూడా తెలియాలి కదా అన్నది విపక్షాల మాటగా ఉంది. మొత్తానికి ప్రభుత్వాన్ని లాజిక్ గా ప్రశ్నించి ఉద్యోగులు షాక్ ఇచ్చేశారు అనుకోవాలేమో.