Begin typing your search above and press return to search.

లోకేశ్ షాకింగ్ ట్వీట్.. కరోనా వేళ ఇలాంటి విమర్శలా?

By:  Tupaki Desk   |   9 April 2020 4:30 AM GMT
లోకేశ్ షాకింగ్ ట్వీట్.. కరోనా వేళ ఇలాంటి విమర్శలా?
X
అన్ని రోజులు ఒకేలా ఉండవు. అందునా.. కరోనా కాలంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇలాంటి వేళ.. రోటీన్ రాజకీయాల్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు అర్థమైనట్లుగా లేదు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన తీరుపై ఆయన స్పందించిన వైనం షాకింగ్ గా మారింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పైతే.. విమర్శించొచ్చు. అంతమాత్రాన సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం సరికాదు. ఆసుపత్రిలో వైద్యులకు మాస్కులు.. గ్లౌజ్ లు లేకపోవటాన్ని డాక్టర్ సుధాకర్ ఎత్తి చూపారని.. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్లుగా విమర్శిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ విషయంలో సదరు వైద్యుడి కులాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్నగా మారుతోంది.

‘‘ఒక దళిత వైద్యుడిపై ప్రతాపం చూపిస్తారా.. జగన్. మీ ఇగో హర్ట్ అయ్యిందని డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయటం దారుణమైన చర్య. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు.. సిబ్బందికి మాస్కులు.. వ్యక్తిగత కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయటం జగన్ అధికార మదానికి నిదర్శనం. అసలు కరోనా పెద్ద విషయం కాదు. ఎన్నికలే ముఖ్యమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీకు ఏం శిక్ష వేయాలి’’ అంటూ పెద్ద ట్వీటే చేసేశారు.

విమర్శలో వైద్యుడు ఏ కులానికి చెందినవాడన్న విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మాస్కులు.. గ్లౌజ్ లు ఇవ్వలేదన్న కారణాన్ని ఎత్తి చూపినందుకు ప్రభుత్వం సస్పెండ్ చేసి ఉంటే.. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించటం తప్పు కాదు. అందుకు భిన్నంగా కులాన్ని తీసుకురావటం ద్వారా లోకేశ్ ఏం కోరుకుంటున్నారా? కరోనా వేళ కూడా ఈ తరహా రాజకీయాలేందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.